Rajasthan: చిన్నపిల్లలు ప్రమాదకరమైన లేదా హానికరమైన వస్తువులతో ఆడుకోకుండా పెద్దవాళ్లు జాగ్రత్తగా పర్యవేక్షించడం చాలా ఉత్తమం. లేదంటే, విషాదకరమైన పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంటుంది. రాజస్థాన్‌లోని (Rajasthan) కోట్‌పుత్లి జిల్లాలో అదే జరిగింది. కేవలం 5 ఏళ్ల వయసున్న ఓ పిల్లాడు నాటుతుపాకీతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ తనను తాను కాల్చుకున్నాడు. ఇంట్లో ఆడుకుంటూ ట్రిగ్గర్ వెనక్కి లాగి వదిలాడు. దీంతో, బుల్లెట్ అతడి తలలోకి దూసుకెళ్లింది. ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడయ్యాయని పోలీసులు తెలిపారు. బాలుడి పేరు దేవాన్షు అని వెల్లడించారు. కోట్‌పుత్లి జిల్లా చిటౌతి కా బర్దా గ్రామంలో ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారి ఒకరు వివరించారు.
Read Also- CM Revanth Reddy: నెత్తిన నీళ్లు చల్లుకున్నంత మాత్రాన.. వాళ్ల పాపాలు తొలగిపోవు.. సీఎం రేవంత్
ఈ ఘోర విషాదం జరిగినప్పుడు బాలుడి తల్లిదండ్రులు ఇంట్లో లేరు. తుపాకీ కాల్పుల శబ్దం వినపడడంతో పొరుగింటివారు అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూశారు. బాలుడు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించారు. ఘటన గురించి వెంటనే బాలుడి తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు ఇంటికి చేరుకొని బాలుడిని హుటాహుటిని హాస్పిటల్‌కు తీసుకెళ్లేటప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం కోసం బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి పంపించారు. బాలుడు దేవాన్షు తండ్రి ముకేష్ గతంలో డిఫెన్స్ అకాడమీని నిర్వహించాడు. ఏడాదికి క్రితం దానిని మూసివేసి, జానపద సింగర్ అయిన తన భార్యతో కలిసి పాటలు పాడడానికి వెళ్తున్నాడు. దేవాన్షు వారికి ఏకైక సంతానమని స్థానికులు చెప్పారు.
పిల్లల్ని గమనిస్తుండాలి
పిల్లలు ఆడుకునేటప్పుడు వారి భద్రతపై తల్లిదండ్రులు, సంరక్షకులు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రమాదకరమైన తుపాకీలు, కత్తులు, మారణాయుధాలు పిల్లల చేతికి దొరకుండా చూసుకోవాలి. అలాంటి వస్తువులతో అస్సలు ఆడుకోనివ్వకూడదు. ఆట స్థలం శుభ్రంగా, భద్రంగా ఉందో లేదో చూసుకోవాలి. ఆడుకునే ప్రదేశాల్లో కంచెలు, నీటి గుంతలు, యంత్రాలు, విద్యుత్ పరికరాల ఉంటే, పిల్లలను వాటికి దూరంగా ఉంచాలి. వాహనాలు వేగంగా ప్రయాణించే రోడ్డుకు సమీపంలో పిల్లల్ని ఆడుకోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వయస్సుకు అనుగుణంగా ఆటపాటలు ఉండేలా చూసుకోవాలి. కాళ్లు, చేతులకు, ఇతర శరరీ భాగాలకు బిగుసుకుపోయే వస్తువులతో ఆడుకోనివ్వకూడదు. అవి ప్రమాదానికి దారితీసే అవకాశాలు ఉంటాయి. పిల్లలు దూరంగా ఆడుకుంటున్నా, లేదా తల్లిదండ్రులే పనిమీద కాస్త దూరంగా ఉన్నా.. ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలి. బయట ఎండలో ఆడుకుటప్పుడు క్యాప్, నీళ్లు ఇచ్చి వేడి నుంచి రక్షణ కల్పించాలి.
Read Also- Food Delivery: స్విగ్గి మోసాన్ని బయటపెట్టిన ఓ కుర్రాడు.. జనాన్ని అడ్డంగా దోచుకుంటున్నారుగా?