New Rules: ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, లేదా ఇతర ఆర్థిక సంబంధమున్న సంస్థలు పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక నిబంధనలను సవరిస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో బ్యాంకింగ్ రూల్స్, ఇన్వెస్ట్‌మెంట్లు, సేవింగ్స్, క్రెడిట్ కార్డు ఛార్జీలు, వడ్డీ రేట్లు, ట్యాక్స్ ఫైలింగ్ వంటి ప్రక్రియలపై ప్రత్యక్ష ప్రభావం పడి మార్పులు చేసుకుంటాయి. ఆ మార్పుల అమలు మొదలుపెట్టడానికి నిర్దిష్ట తేదీల్లో ఎంచుకుంటాయి. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీని ఎంచుకుంటుంటాయి. శనివారం నుంచి ప్రారంభం కానున్న 2025 నవంబర్ 1 నుంచి కూడా కొన్ని ముఖ్యమైన నిబంధనలు (New Rules) కూడా అమల్లోకి రాబోతున్నాయి. ఇవి సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు వర్గాల వారీగా ప్రభావితం చేయబోతున్నాయి. వాటిపై అవగాహన ఉండడం ఉపయోగకరంగా ఉంటుంది. ఆ నిబంధనలు మీరూ తెలుసుకోండి.
ఆధార్ అప్‌డేట్ ఛార్జీలపై ఉపశమనం
ఆధార్ అప్‌డేట్‌కు సంబంధించిన ఛార్జీల విషయంలో యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల వేలిముద్రలు, ఐరిస్ స్కానింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌కు చెల్లించాల్సిన రూ.125 ఛార్జీని రద్దు చేసింది. ఒక ఏడాదిపాటు ఉచితంగా ఉంటుందని తెలిపింది. ఈ పొడగింపు నవంబర్ 1 (శనివారం) నుంచి మొదలవుతుంది. మరో ముఖ్యమైన సౌలభ్యం ఏంటంటే, ఇకపై, ఎలాంటి సహాయక పత్రాలు సమర్పించకుండానే ఆధార్ చిరునామా, పుట్టిన తేదీ, పేరును ఆన్‌లైన్‌లో కూడా అప్‌డేట్ చేసుకునే వెసులుబాటును యూఐడీఏఐ కల్పించింది.
Read Also- Sandigdham teaser: ‘సందిగ్ధం’ టీజర్ వచ్చేసింది గురూ.. ఓ లుక్కేసుకో మరి..
ఒక అకౌంట్‌కు నలుగురు నామినీలు
బ్యాంకులు తమ ఖాతాదారులను ఒకే ఖాతా, లాకర్, వస్తువుల సేఫ్ కస్టడీ కోసం నలుగురు వరకు వ్యక్తులను నామినేట్ చేయవచ్చు. ఈ కొత్త నిబంధన శనివారం నుంచి ఆచరణలోకి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాలకు డబ్బును అందుబాటులో ఉంచడం, యాజమాన్యం విషయంలో తలెత్తే వివాదాలను నివారించడం ఈ కొత్త రూల్ ముఖ్య ఉద్దేశంగా ఉంది. అంతేకాదు, నామినీలను మార్చుకునే ప్రక్రియ కూడా మరింత సులభతరం అయ్యింది.
అమలులోకి కొత్త జీఎస్టీ శ్లాబ్‌లు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని వస్తువులపై కొత్తగా 2 శ్లాబ్‌ల జీఎస్టీ రేట్ల విధానాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ విధానం శనివారం నుంచి అమలు కానుంది. సూచించిన వస్తువులపై గతంలో 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం నాలుగు శ్లాబ్‌ల వ్యవస్థ ఉండేది. 12 శాతం, 18 శాతం శ్లాబ్‌లను తొలగిస్తారు. లగ్జరీ, హానికరమైన వస్తువులు, ఉత్పత్తులపై జీఎస్టీ ఎక్కువగా ఉంటుంది. దేశంలో పరోక్ష పన్నుల నిర్మాణాన్ని సులభతరం చేయడం ఈ మార్పునకు ముఖ్యఉద్దేశంగా ఉంది.
ఎన్‌పీఎస్ గడువు పొడిగింపు
ఎన్‌పీఎస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్) నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌కి (UPS) మారాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గడువును పొడగించారు. నవంబర్ 30 వరకు అవకాశం ఇస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ గ్యాప్‌లో ఉద్యోగులు పథకానికి సంబంధించిన వివరాలను తెలుసుకొని, నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.
పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు ఇకపై తమ వార్షిక లైఫ్ సర్టిఫికెట్‌ను (జీవించి ఉన్నట్టుగా ధృవీకరణ పత్రం) తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ నెలాఖరులోపు తప్పనిసరిగా సబ్‌మిట్ చేయాలి. తమ బ్యాంక్ బ్రాంచ్‌లలో, ఆన్‌లైన్‌లో జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా అప్‌డేట్ చేయవచ్చు. గడువులోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించకపోతే, పెన్షన్ చెల్లింపులలో ఆలస్యం, నిలుపుదల చేసే అవకాశం ఉంటుంది.
పీఎన్‌బీ లాకర్ ఛార్జీలు తగ్గింపు!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశవ్యాప్తంగా తన లాకర్ అద్దె ఛార్జీలను సవరించబోతోంది. వివిధ కేటగిరీల లాకర్ అద్దె ఛార్జీలను తగ్గించనున్నట్టు తెలుస్తోంది. ఈ సవరించిన ఈ రేట్లను బ్యాంక్ వెబ్‌సైట్‌లో నవంబర్‌లోనే ప్రకటించనుంది. నోటిఫికేషన్ విడుదలైన 30 రోజుల తర్వాత ఇవి అమలులోకి వస్తాయి. కొత్త రేట్లు లాకర్ సైజు, ప్రాంతం ఆధారంగా రూపొందిస్తారు.
ఎస్‌బీఐ కార్డుదారులపై కొత్త ఛార్జీలు
ఎస్‌బీఐ కార్డును ఉపయోగించిన వినియోగదారులు ఇకపై ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ఫీజులను థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెలిస్తే 1 శాతం ఛార్జీలు పడతాయి. అంటే, మొబిక్విక్, క్రెడ్ వంటి థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా పేమెంట్ చేస్తే ఇది వర్తిస్తుంది. ఎస్‌బీఐ కార్డ్ అధికారిక వెబ్‌సైట్లు, లేదా క్యాంపస్‌లోని పీవోఎస్ మెషీన్‌ల ద్వారా నేరుగా చెల్లింపు చేసేవారిపై ఈ ఛార్జీలు విధించబోరు. ఈ నిబంధన నవంబర్ 1 (శనివారం) నుంచి అమల్లోకి వస్తుంది.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				