Nestle CEO Fired: ఉద్యోగం అయినా, ఇంకే బాధ్యతైనా సక్రమంగా నిర్వర్తించకపోతే, ఆదమరిచి తప్పుదోవలో పయనిస్తే ప్రతికూల పర్యావసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఆహార రంగ దిగ్గజం ‘నెస్లే’ కంపెనీ సీఈవో లారెంట్ ఫ్రెక్స్ (Nestle CEO Fired) ఆ పరిస్థితే ఎదురైంది. నేరుగా తనకు రిపోర్టింగ్ చేసే బాధ్యతలో ఉన్న ఓ కిందిస్థాయి ఉద్యోగినితో ఆయన శారీరక సంబంధం నడిపారు. ఈ విషయం యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో తక్షణమే ఆయనపై తొలగింపు వేటు వేసింది.
లారెంట్ ఫ్రెక్స్ ఒక కిందిస్థాయి మహిళా ఎంప్లాయీతో రహస్య ప్రేమను కొనసాగించారని, తద్వారా సంస్థ వ్యాపార నియమావళిని ఆయన ఉల్లంఘించారని ప్రకటనలో నెస్లే యాజమాన్యం పేర్కొంది. ఈ కారణంగానే కంపెనీ నుంచి బహిష్కరిస్తున్నట్టు తెలిపింది. కాగా, నెస్లే సంస్థ కింద నెస్ప్రెస్సో, కిట్‌కాట్ వంటి అంతర్జాతీయ ఉత్పత్తులు ఉన్నాయి. ఈ ఉత్పత్తులను చాలా దేశాల్లో కంపెనీ విక్రయిస్తోంది. అయితే, కంపెనీ కొత్త సీఈవోగా నెస్ప్రెస్సో విభాగం సీఈవోగా బాధ్యతలు చూసుకుంటున్న ఫిలిప్ నవ్రాటిల్‌ను నియమిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు బోర్డు సభ్యులు కూడా ఆమోదం తెలిపారని వెల్లడించింది.
విచారణ తర్వాతే నిర్ణయం
కాగా, అంతర్గత విచారణ అనంతరమే లారెంట్ ఫ్రెక్స్‌పై నెస్లే కంపెనీ ఈ చర్యలు తీసుకుంది. నెస్లే సంస్థ ఛైర్మన్ పాల్ బుల్కే, స్వతంత్ర డైరెక్టర్ పాబ్లో ఆధ్వర్యంలో న్యాయ సలహాదారుల సమక్షంలో విచారణ జరిపారు. ఈ వ్యవహారంపై చైర్మన్ బుల్కే మాట్లాడుతూ, విలువలు, పాలన వ్యవస్థ నెస్లే సంస్థకు పునాదులు అని స్పష్టం చేశారు. సీఈవో తొలగింపు కంపెనీకి అవసరమైన నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ కంపెనీకి సేవలు అందించినందుకు లారెంట్‌కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. కాగా, నెస్లే సంస్థలో లారెంట్ ఫ్రెక్స్ కెరీర్‌ను పరిశీలిస్తే, 1986లో ఫ్రాన్స్‌లో ఆయన ఈ కంపెనీలో చేరారు. 2008 రుణాల సంక్షోభ సమయంలో కంపెనీ యూరప్ విభాగాన్ని విజయవంతంగా నడిపించారు. దీంతో, లాటిన్ అమెరికా విభాగం బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు. ఆ తర్వాత సీఈవో పదోన్నతి పొందారు.
Read Also- BRS Errabelli Dayakar Rao: స్థానిక ఎన్నికల కోసం కాళేశ్వరం డ్రామా.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్!
ఆసక్తికమైన విషయం ఏంటంటే, లారెంట్.. నెస్లే కంపెనీ సీఈవోగా తక్కువ కాలమే కొనసాగారు. 2024 సెప్టెంబర్‌లో అనూహ్యంగా సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. కంపెనీ ఉత్పత్తులకు మార్కెట్లో ఆదరణ తగ్గిపోతున్న సమయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తగ్గిన కొనుగోళ్లను తిరిగి పెంచగలరని కంపెనీ భావించింది. అయితే, పదవిలో ఎక్కిన తర్వాత ఒక సంవత్సరం కూడా పూర్తి కాకముందే వ్యక్తిగత సంబంధాల కారణంగా ఆయన తొలగింపునకు గురయ్యారు.
సీఈవో తొలగింపు వ్యవహారం నెస్లే కంపెనీ స్టాక్స్‌పై ప్రభావం చూపింది. ఇప్పటికే ఈ ఏడాది కంపెనీ షేర్ల విలువ ఏకంగా దాదాపు 25 శాతం వరకు పడిపోయింది. దీంతో, నెస్లే కంపెనీ యాజమాన్యం ఆందోళనకు గురవుతోంది. ఎందుకంటే, పెన్షన్ ఫండ్లు కంపెనీలోకి పెద్ద ఎత్తున పెట్టుబడిగా వచ్చాయి. కాగా, నెస్లేకు చెందిన పాపులర్ ఫుడ్ బ్రాండ్ల జాబితాలో ప్యూరినా (కుక్కల ఆహారం), మెగ్గీ క్యూబ్స్, గెర్బర్ బేబీ ఫుడ్, నెస్‌క్విక్ చాక్లెట్ డ్రింక్స్ ఉన్నాయి.
Read Also- Rashid Khan: చరిత్ర తిరగరాసిన అఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. ప్రపంచంలో ఏ ఆటగాడికీ సాధ్యంకాలేదు