Mobile Recharge: మొబైల్ వినియోగదారులకు మరోసారి ధరల పెంపు భారం పడే అవకాశం కనిపిస్తోంది. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం, Jio, Airtel, Vi వంటి టెలికాం కంపెనీలు తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను 16 శాతం నుంచి 20 శాతం వరకు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇది గత ఎనిమిదేళ్లలో నాలుగోసారి టారిఫ్‌లు పెరగడం కావడం గమనార్హం. ఈ పెంపు 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో, అంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో అమలులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మార్పులు 4G, 5G ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లన్నింటికీ వర్తిస్తాయి.
ధరల పెంపు యూజర్ల జేబుపై నేరుగా ప్రభావం పడనుంది. ఉదాహరణకు, ప్రస్తుతం రూ.299గా ఉన్న Jio 28 రోజుల 1.5GB/డే ప్లాన్ ధర పెరిగితే రూ.347 నుంచి రూ.359 మధ్యకు చేరవచ్చు. అలాగే రూ.349 ఉన్న అన్‌లిమిటెడ్ 5G ప్లాన్ ధర రూ.405 నుంచి రూ.419 వరకు పెరగవచ్చు. Airtel, Vi వినియోగదారులకు కూడా ఇదే తరహా పెంపు ఉండే అవకాశం ఉంది. దీని ఫలితంగా సాధారణ మొబైల్ యూజర్‌కు నెలకు అదనంగా రూ.50 నుంచి రూ.70 వరకు ఖర్చు పెరిగే అవకాశం ఉంది, వార్షికంగా చూస్తే ఇది దాదాపు రూ.800కు పైగా భారం కావచ్చు.
టెలికాం కంపెనీలు ధరలు పెంచడానికి ప్రధానంగా 5Gపై చేసిన భారీ పెట్టుబడులే కారణంగా నిపుణులు చెబుతున్నారు. 2022లో జరిగిన 5G స్పెక్ట్రమ్ వేలంలో కంపెనీలు కలిపి సుమారు రూ.1.5 లక్షల కోట్లను ఖర్చు చేశాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్ విస్తరణకు భారీగా పెట్టుబడులు పెట్టారు. ప్రారంభ దశలో యూజర్లను ఆకర్షించేందుకు తక్కువ ధరలకు, కొన్నిచోట్ల అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా అందించారు. ప్రస్తుతం Jio, Airtelలలో 5G వినియోగదారుల శాతం ఎక్కువ పెరగడంతో, ఇప్పుడు ఆ పెట్టుబడుల నుంచి ఆదాయం రాబట్టేందుకు టారిఫ్‌లు పెంచుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: Thummala Nageswara Rao: పసుపుకు జీఐ ట్యాగ్ రావడం మన రైతులకు గర్వకారణం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మొత్తంగా చూస్తే, వచ్చే ఏడాది నుంచి మొబైల్ రీఛార్జ్ ఖర్చులు మరింత పెరగడం నిజమేనని తెలుస్తోంది. వినియోగదారులు తమ మొబైల్ ఖర్చులకు ముందుగానే ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

