LIC Jeevan Utsav: ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) నూతన ఏడాది ఆరంభంలోనే కొత్త పాలసీని ప్రకటించింది. ‘ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం’ (LIC Jeevan Utsav Single Premium) పేరిట రూపొందించిన ఈ పాలసీ జనవరి 12 నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది. ఈ పాలసీ షేర్ మార్కెట్, లేదా మ్యూచువల్ ఫండ్లకు లింక్ అయ్యి ఉండదని వివరించింది. మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం లేకుండా స్థిరమైన లాభాలు అందిస్తుందని తెలిపింది. అంతేకాదు, ఈ పాలసీ నాన్-పార్టిసిపేటింగ్, అంటే బోనసులు, లాభాల్లో పాలసీదారులకు భాగస్వామ్యం ఉండదని వివరించింది. పాలసీ తీసుకునేటప్పుడు, అంటే ప్రారంభంలో చెప్పిన ప్రయోజనాలు మాత్రమే దక్కుతాయి. మరోవైపు, ఇది వ్యక్తిగత బీమా పాలసీ మాత్రమేనని స్పష్టం చేసింది. అయితే, బీమాతో పాటు సేవింగ్స్ ప్రయోజనం పొందవచ్చని, జీవితాంతం కవరేజ్ ఇస్తుందని పేర్కొంది. ఈ మేరకు సోమవారం నాడు స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇస్తూ రెగ్యులేటరీ ఫైలింగ్ దాఖలు చేసింది.
దేశవ్యాప్తంగా అందరికీ ఈ పాలసీ అందుబాటులో ఉంటుందని, రిటైల్ కస్టమర్ల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ పాలసీని రూపొందించినట్టు వివరించింది. కాగా, సింగిల్ ప్రీమియం పాలసీల్లో పాలసీదారులు ప్రారంభంలో ఒకేసారి డబ్బులు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిబంధనల ప్రకారం దీర్ఘకాలంలో ప్రయోజనాలు లభిస్తాయి. కాగా, పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎల్ఐసీ ఇంకా ప్రకటించలేదు.
Read Also- Sridhar Babu: ఎలివేటెడ్ కారిడార్ అలైన్‌మెంట్ నో చేంజ్.. జీహెచ్ఎంసీ విభజనపై మంత్రి శ్రీధర్ బాబు!
పాలసీ లాప్స్‌పై మార్చి 2 వరకు ఛాన్స్
నూతన సంవత్సరం సందర్భంగా ఎల్ఐసీ మరో కొత్త స్కీమ్‌ని కూడా ప్రకటించింది. సకాలంలో పేమెంట్ చెల్లించక మురిగిపోయిన వ్యక్తిగత పాలసీలు (lapsed policies) ఉంటే వాటిని పునరుద్ధరించేందుకు ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. మార్చి 2 వరకు దేశవ్యాప్తంగా ఈ ప్రత్యేక పథకం అందుబాటులో ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొంది. అర్హత కలిగిన పాలసీదారులు సూచించిన నాన్-లింక్డ్, మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్లను రాయితీలతో పునరుద్ధరించుకోవచ్చునని సూచించింది. నాన్-లింక్డు పాలసీలకు సంబంధించి ఆలస్య రుసుములో 30 శాతం వరకు రాయితీని పొందవచ్చునని తెలిపింది. ప్రీమియాన్ని బట్టి రాయితీ ఉంటుందని తెలిపింది. ఇక, మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్లకు పూర్తిస్థాయి ఆలస్య ఫీజు మాఫీతో పాలసీలను పునరుద్ధరించుకోవచ్చునని తెలిపింది. సంబంధిత పాలసీలకు సంబంధించిన నిబంధనలు, షరతులు వర్తిస్తాయని వివరించింది. ప్రీమియం పేయింట్ టర్మ్‌లో లాప్స్ అయిన పాలసీలకు పునరుద్ధరణ అవకాశం ఉంటుందని తెలిపింది. అయితే, మెడికల్ లేదా హెల్త్ సంబంధిత పాలసీల పునరుద్ధరణపై మాత్రం ఎలాంటి రాయితీలు ఉండబోవని ఎల్ఐసీ క్లారిటీ ఇచ్చింది.

