Mukesh Ambani: ముకేష్ అంబానీ (Mukesh Ambani) ఈ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది సంపద. తండ్రి స్థాపించిన వ్యాపారాలను నేడు లక్షలాది కోట్ల రూపాయల సామ్రాజ్యంగా విస్తరించిన ఘనత ఆయనది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ (Reliance Industries) చైర్మన్‌గా ఉన్న ఆయన సంపద విలువ మంగళవారం (జనవరి 6) నాటికి 108 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే, ఒక్కో డాలర్ విలువను 90 రూపాయలుగా లెక్కిస్తే, అంబానీ ఆస్తి విలువ ఏకంగా రూ.9.74 లక్ష కోట్లు పైగానే ఉంది. ప్రపంచ టాప్ ధనికుల జాబితాలో ఆయన 18వ స్థానంలో (జనవరి 6 నాటికి) ఉన్నారు. ఇంత డబ్బును కొన్ని రాష్ట్రాలైతే కొన్నేళ్లపాటు బడ్జెట్ కూడా పెట్టుకోవచ్చు. మరి ఇంత డబ్బు ఖర్చు పెట్టాలంటే ముకేష్ అంబానీకి ఎంతకాలం పడుతుంది? అనే ఆసక్తికర సందేహం ఎప్పుడైనా వచ్చిందా?. ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానమేమీ చెప్పలేం, కానీ, ప్రతి రోజూ రూ.5 కోట్లు చొప్పున ఖర్చు పెడితే ఎంతకాలంలో ఖర్చవుతుందో ఒక అంచనా వేయవచ్చు.
రోజుకు రూ.5 కోట్లు ఖర్చుపెడితే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ రోజుకు రూ.5 కోట్లు చొప్పున ఖర్చు చేస్తే, ఆయన సంపద మొత్తం కరిగిపోవడానికి ఎంతకాలం పడుతుందో సరదాగా లెక్కించి చూద్దాం. ముకేష్ అంబానీ మొత్తం సంపద రూ. రూ.9.74 లక్షల కోట్లుగా ఉంది. ఇవాళ్టి నుంచి ఎలాంటి వ్యాపార ఆదాయం లేకుండా, పెట్టుబడులు పెట్టకుండా, వడ్డీ ఆదాయం లేకుండా, ఎలాంటి ఖర్చులు లేకుండా… ప్రతిరోజూ రూ.5 కోట్లు చొప్పున మొత్తం 1,94,800 రోజులపాటు ఖర్చు చేయవచ్చు. ఈ రోజులను 365తో భాగిస్తే, 533 సంవత్సరాలు వస్తోంది. అంటే, రోజుకు రూ.5 కోట్లు చొప్పున మొత్తం 533 ఏళ్లపాటు ముకేస్ అంబానీ ఆస్తిని ఖర్చు పెట్టవచ్చు. అంటే, ముకేష్ అంబానీ ఇకపై ఎలాంటి వ్యాపారాలు నిర్వహించకుండా, ఖాళీగా ఉంటూ రోజుకు రూ.5 కోట్లు ఖర్చు చేస్తే… 5 జన్మలు ఎత్తినా సరే సరిపోతుందన్న మాట.
ముకేష్ ఆదాయం ఎలా ఉంటుంది?
ముకేష్ అంబానీ అధినేతగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కింద వివిధ రంగాలలో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వీటి ద్వారా భారీ మొత్తంలో ఆదాయం వస్తుంది. పెట్రో కెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికం, మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు కీలక ఆదాయ రంగాలు ఉన్నాయి. కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను ముకేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ 1966లో ప్రారంభించారు. చిన్న నూలు వ్యాపారిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, టెక్స్‌లైల్స్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తూ వెళ్లింది. 2002లో ధీరూభాయ్ అంబానీ కన్నుమూశారు. ఆ కుటుంబంలో విభేదాలు ఏర్పడి అన్నదమ్ముళ్లైన ముకేష్ అంబానీ, అనిల్ అంబానీ మధ్య ఆస్తుల పంపకాలు జరిగాయి. అనిల్ అంబానీ క్రమక్రమంగా అన్ని వ్యాపారాల్లోనూ దివాళా తీయగా, ముకేష్ అంబానీ మాత్రం ప్రతి నిమిషం కోట్లాది రూపాయల లాభాలను ఆర్జిస్తున్నారు.
Read Also- Roja On Nara Lokesh: మీరు చేసేది చాలా తప్పు.. పదింతలు అనుభవిస్తారు.. రోజా స్ట్రాంగ్ వార్నింగ్

