Google AI: టెక్నాలజీ వేగంతో ముందుకెళ్తున్న ఈ రోజుల్లో, ఏ ఫోటో నిజంగా తీసిందో? ఏది ఏఐతో చేసిందో? చెప్పడం చాలా కష్టమైపోయింది. ఈ సమస్యను తగ్గించడానికి గూగుల్ ఇప్పుడు జెమిని (Gemini) యాప్‌లో కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. దీని వలన ఫోటో గూగుల్ ఏఐతో సృష్టించబడిందా లేదా ఎడిట్ చేయబడిందా అనేది మీరు రెండు సెకన్లలోనే చెక్ చేసుకోవచ్చు. డిజిటల్ కంటెంట్ మీద పెరిగిపోతున్న డౌట్స్‌ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ స్టెప్, ఏఐ పారదర్శకత వైపు గూగుల్ వేసిన మరో మంచి అడుగుగా మాట్లాడుకుంటున్నారు. ఈ అప్‌డేట్‌ను కంపెనీ కొత్త Gemini 3 ఆధారంగా వచ్చిన Nano Banana Pro మోడల్‌తో కలిసి రోల్ అవుట్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫీచర్ చిత్రాలకే (Images) మాత్రమే అందుబాటులో ఉంది. ఇది SynthID అనే గూగుల్ స్పెషల్ వాటర్‌మార్కింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. మానవ కంటికి కనిపించని చిన్న మార్కర్లు ఫోటోలో దాచిపెట్టబడతాయి. ఫోటో ఎలాగైనా కనిపిస్తుంది కానీ Gemini మాత్రం వాటిని గుర్తిస్తుంది. త్వరలోనే వీడియోలు, ఆడియోలకూ ఇదే విధంగా వెరిఫికేషన్ వచ్చేలా గూగుల్ ప్లాన్ చేస్తోంది. అదనంగా, ఈ ఫీచర్‌ను Google Search, ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు కూడా విస్తరించనున్నారు. అలాగే డిజిటల్ కంటెంట్ నిజస్వరూపం బయట పెట్టడానికి ఉపయోగించే C2PA కంటెంట్ క్రెడెన్షియల్స్ సపోర్ట్ కూడా త్వరలో వస్తుంది.
ఇది ఎలా పనిచేస్తుందంటే? (AI Image Detector Online)
ఈ కొత్త సిస్టమ్ SynthID వాటర్‌మార్క్‌లపై ఆధారపడి పనిచేస్తుంది. గూగుల్ ఏఐ ఎప్పుడైనా ఫోటోను సృష్టించినా లేదా ఎడిట్ చేసినా, అందులో కనిపించని డిజిటల్ మార్కర్లు ఆటోమేటిక్‌గా జత అవుతాయి. మనం చూసే దానికి ఎలాంటి తేడా కనిపించదు కానీ Gemini యాప్ మాత్రం ఆ మార్కర్లను డిటెక్ట్ చేసి ఫోటో ఏఐతో చేసినదా? కాదా అని చెప్పేస్తుంది.
ఒక చిన్న లిమిటేషన్ మాత్రం ఉంది. ఇది గూగుల్ ఏఐతో సృష్టించిన లేదా ఎడిట్ చేసిన చిత్రాలను మాత్రమే గుర్తిస్తుంది. ఇతర కంపెనీల ఏఐతో చేసిన ఫోటోలు దీనితో వెరిఫై కావు. అయినా కూడా 2023లో SynthID వచ్చాక ఇప్పటివరకు 20 బిలియన్లకుపైగా ఏఐ ఫోటోలలో ఈ వాటర్‌మార్క్ వేశారు. ఇవన్నీ ఇప్పుడు Gemini యాప్‌లో వెరిఫై చేయవచ్చు.
ఎలా వెరిఫై చేయాలి? (AI Image Detector Online)
స్టెప్ 1: Gemini యాప్‌ను ఓపెన్ చేసి కొత్త సంభాషణ మొదలు పెట్టండి.
స్టెప్ 2: మీరు చెక్ చేయాలనుకునే చిత్రాన్ని గ్యాలరీ, మెసేజ్ లేదా వెబ్‌సైట్ నుండి అప్‌లోడ్ చేయండి.
స్టెప్ 3: “ఈ ఫోటో గూగుల్ ఏఐతో తయారైందా?” లేదా “ఇది ఏఐ జనరేటెడ్ చిత్రమా?” వంటి ప్రశ్నను టైప్ చేయండి.
స్టెప్ 4: Gemini ఆ చిత్రంలో SynthID వాటర్‌మార్క్ ఉన్నదా లేదో విశ్లేషిస్తుంది.
స్టెప్ 5: చివరగా, ఆ చిత్రం గూగుల్ ఏఐ సృష్టించిందా లేదా ఎడిట్ చేసిందా అన్న విషయంపై స్పష్టమైన సమాధానంతో పాటు చిన్న వివరణ కూడా చూపిస్తుంది.
డిజిటల్ ప్రపంచంలో ఫేక్ కంటెంట్ పెరుగుతున్న సమయంలో, ఈ కొత్త ఫీచర్ ఏఐ సృష్టించిన చిత్రాలను గుర్తించడంలో కీలక పాత్ర వహిస్తుంది. దీని వలన వినియోగదారులు కూడా నష్టపోకుండా ఉంటారు.

