Pawan Kalyan: పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే తన ముందున్న ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తన ప్రతి అడుగూ ఆ దిశగానే ఉంటాయని తెలిపారు. జల్ జీవన్ మిషన్, పల్లె పండగ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించాలని అధికారులకు స్పష్టం చేశారు. పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో త్వరలో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించబోతున్నట్టు పవన్ తెలిపారు.
పనుల పురోగతిపై అసంతృప్తి
మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పల్లె పండగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వమిత్ర పథకాలపై అధికారులతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ ద్వారా గ్రామీణ రోడ్ల పూర్తి సమాచారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. సాస్కీ నిధుల సాయంతో పల్లె పండగ 2.0ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. నిధులు అందుబాటులో ఉన్నా.. పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అడవి తల్లిబాట, జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా తక్షణం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
‘ప్రజల చేతిలో రోడ్ల వివరాలు’
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామీణ రహదారులన్నింటినీ జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టంకు అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని పవన్ ఆదేశించారు. మనం ప్రయాణం చేసే మార్గంలో రోడ్డు ఉందా? లేదా? ఉంటే ఎలా ఉంది? అనే వివరాలు ప్రజల చేతిలో అందుబాటులో ఉండే వ్యవస్థను తీసుకురావాలని పేర్కొన్నారు. ‘అసలు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని రహదారులు ఉన్నాయి? అవి ఎలా ఉన్నాయి? అనే వివరాలు కూడా ప్రతి ఒక్కరికీ తెలియాలి. కొత్త రహదారి నిర్మిస్తే అందుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటలోకి రావాలి. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని, రహదారులను మెరుగుపరచుకునేలా ఈ సాంకేతికత ఉండాలి. ఈ విధంగా జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టంను త్వరితగతిన అభివృద్ధి చేయండి. 48 గంటల్లో అందుకు సంబంధించి ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం కావాలి’ అని అధికారులను ఆదేశించారు.
అలసత్వం వద్దు
గిరిజన గ్రామాల్లో చేపట్టిన అడవి తల్లిబాట పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనబడడం లేదని పవన్ అన్నారు. ‘ఎక్కడైనా అటవీ శాఖతోగాని, ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తక్షణం పరిష్కరించుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోండి. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయికి వెళ్లి పనుల పురోగతిని పరిశీలించాలి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఏదైనా సమస్య ఉంటే దాన్ని తక్షణం పరిష్కరించి పనులు ముందుకు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలి’ అని పవన్ దిశానిర్దేశం చేశారు.
Also Read: SC on Stray dogs: సుప్రీంకోర్టు మరో సంచలనం.. వీధి కుక్కలపై కీలక ఆదేశాలు జారీ
పల్లె పండగ 2.0ని పట్టాలెక్కిద్దాం
పల్లె పండగ 2.0 కోసం సాస్కీ నిధులు వినియోగించుకోవాలని అధికారులకు పవన్ సూచించారు. ఇందుకోసం ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా కృషి చేయాలని కోరారు. ‘తక్షణం పల్లె పండగ 2.0ని పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేయాలి. రూ.2,123 కోట్ల సాస్కీ నిధులతో పల్లెల్లో 4007 కిలోమీటర్ల మేర రహదారులు, గోకులాలు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలి’ అని దిశానిర్దేశం చేశారు.
ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం
• త్వరలో అందుబాటులోకి ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’
• పైలెట్ ప్రాజెక్టుగా అడవి తల్లి బాటకు అనుసంధానం
• సాస్కీ నిధులతో పల్లె పండగ 2.0
• క్షేత్ర స్థాయి పర్యటనలతో జల్ జీవన్ మిషన్, స్వమిత్వ పనుల పరిశీలన
• స్వచ్ఛ జలం.. గుంతలు లేని… pic.twitter.com/6j5iomNJ8E— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) November 7, 2025
