Hyderabad Car Scam: రూ.26 వేలకే కారు అంటూ ఊదరగొట్టారు. రిపబ్లిక్ డే రోజున డబ్బు కట్టి నచ్చిన కారు తీసుకెళ్లవచ్చని పెద్ద ఎత్తున రీల్స్ చేశారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఆఫర్ నిజమేనని ప్రజలు నమ్మారు. రీల్స్ లో చెప్పిన అడ్రస్ కు సోమవారం (జనవరి 26) తరలి వచ్చారు. తీరా సోషల్ మీడియాలో చెప్పిందంతా ఉత్తుత్తి ప్రచారమేనని తెలుసుకొని.. కార్ల నిర్వాహకుడిపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది.
వివరాల్లో వెళ్తే..
మేడ్చల్ పరిధిలోని మల్లాపూర్ కు చెందిన రోషన్.. ‘ట్రస్ట్ కార్స్’ పేరుతో పాత కార్లు విక్రయిస్తున్నాడు. అయితే రిపబ్లిక్ డే సందర్భంగా రూ.26 వేలకే కారు ఇస్తున్నట్లు అతడు ప్రచారం చేశాడు. తన వద్ద ఉన్న 50 కార్లను కేవలం రూ.26 వేలకే అమ్ముతున్నట్లు ప్రకటించారు. ఈ ఆఫర్ రిపబ్లిక్ డే (సోమవారం) ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొన్నాడు. తాము చెబుతున్న రూ.26 వేలు.. డౌన్ పేమెంట్ కాదని.. పూర్తి పేమెంట్ అంటూ పెద్ద ఎత్తున రీల్స్ చేసి సోషల్ మీడియా ప్రచారం చేశాడు. దీనిని నిజమని నమ్మి మల్లాపూర్ లో చెప్పిన అడ్రస్ వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు.
కార్ల నిర్వాహకుడిపై దాడి..
కార్లు కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున జనాలు రావడంతో రోషన్ ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించాడు. తన వద్ద 50 కార్లు లేవని.. 10 మాత్రమే ఉన్నాయని వారికి చెప్పాడు. అది కూడా లాటరీ తీసి పేరు వచ్చిన వారికి మాత్రమే అందిస్తానని చెప్పాడు. రీల్స్ లో చెప్పిన దానికి.. బయట చెబుతున్న దానికి పొంతన లేకపోవడంతో అక్కడికి వచ్చిన వారంతా ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. తమను మోసం చేశావంటూ రోషన్ పై దాడికి తెగబడ్డారు. అలాగే అక్కడ ఉన్న కార్లపై కూడా రాళ్లు విసిరి ధ్వంసం చేశారు.
పోలీసుల రంగ ప్రవేశం..
మల్లాపూర్ లోని ట్రస్ట్ కార్స్ వద్ద పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటీనా ఘటన స్థలికి చేరుకున్న నాచారం పోలీసులు.. కార్ల నిర్వాహకుడు రోషన్ ను దాడి నుంచి రక్షించారు. అనంతరం నాచారం పీఎస్ కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రూ.26 వేలకే కారు.. ఇన్స్టాగ్రామ్ వీడియో పోస్ట్ చేసిన వ్యాపారి.. చివరకు ఏమైందంటే..?
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్ కు చెందిన రోషన్ అనే పాత కార్ల వ్యాపారి రిపబ్లిక్ డే సందర్భంగా రూ.26 వేలకే కారు ఇస్తున్నట్లు ప్రచారం
తన వద్ద ఉన్న 50 కార్లను కేవలం రూ.26 వేలకే అమ్ముతున్నట్లు… pic.twitter.com/h8qLXQZmv6
— BIG TV Breaking News (@bigtvtelugu) January 26, 2026
Also Read: V. C. Sajjanar: ‘మనుషులున్నారు కానీ.. మానవత్వం ఏది?’ అనే ప్రశ్నకు నిలువెత్తు నిదర్శనం!
సజ్జనార్ వార్నింగ్..
సోషల్ మీడియా క్రేజ్‌ను అడ్డుపెట్టుకొని లక్కీ డ్రాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలు తప్పవని ఇటీవలే హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) హెచ్చరించారు. గతంలో బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసిన కొందరు ఆ దందాకు అడ్డుకట్ట పడటంతో ఇప్పుడు ‘లక్కీ డ్రాల’ పేర మోసాలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు. కార్లు, ఖరీదైన బైకులు, ఇండ్లు బహుమతులుగా ఇస్తామంటూ ప్రజలకు ఎర వేసి నిలువునా మోసం చేస్తున్నారన్నారు. ఈ మేరకు రీల్స్‌లో ఆర్భాటపు ప్రచారాలు చేస్తూ వాస్తవంలో మోసాలకు పాల్పడుతున్న పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్ల వీడియోలను ‘ఎక్స్’లో ఆయన షేర్ చేశారు.

