T Hub – CM Revanth: స్టార్టప్ కంపెనీల కోసం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన టీ-హబ్ లోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తారన్న వార్తలకు సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు. టీ-హబ్‌ను స్టార్టప్‌ల కేంద్రంగానే కొనసాగించనున్నట్లు తేల్చి చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఫోన్ లో ఆదేశాలు జారీ చేశారు. అద్దె భవనాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్ కు తరలిస్తారన్న వార్తలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు.
టీ-హబ్ జోలికి వెళ్లొద్దు
దావోస్ పర్యటన ముగించుకొని నేరుగా అమెరికాకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. అక్కడి నుంచి సీఎస్ కు ఫోన్ చేశారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు. టీ-హబ్ ను మాత్రం ప్రత్యేకంగా స్టార్టప్ ల కేంద్రంగానే గుర్తించాలని సీఎస్ కు సూచించారు. ఇంక్యుబేటర్‌గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్‌గా స్టార్టప్‌లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ-హబ్‌లో ఇతర కార్యాలయాలు ఉండకూడదని తేల్చి చెప్పారు. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే విరమించుకోవాలని సీఎస్ కు రేవంత్ రెడ్డి సూచించారు.
అసలు ఎందుకీ చర్చ..
అద్దె భవనాల్లో పనిచేస్తున్న 39 ప్రభుత్వ కార్యాలయాలను సొంత భవనాలు, ప్రభుత్వ స్థలాల్లోకి తరలించాలంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే బేగంపేట రెవెన్యూ డివిజనల్ ఆఫీసు, కమర్షియల్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్, తదితర ఆఫీసులను టీ-హబ్ లోకి మార్చబోతున్నారంటూ ప్రచారం ఊపందుకొంది. అదే జరిగితే అంకుర సంస్థల కోసం ఏర్పాటు చేసిన టీ-హబ్ ఉద్దేశం నిర్వీర్యమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ అలాంటి ఆలోచనలు ఉంటే విరమించుకోవాలని అధికారులకు సూచించడంతో ఈ ప్రచారానికి ముగింపు పడినట్లైంది.
Also Read: Bhatti Vs Harish Rao: భట్టి గారూ… నేను సూటిగా అడుగుతున్నా.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
2015లో టీ-హబ్ ఏర్పాటు..
దేశంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ హబ్ గా 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం టీ-హబ్ ను నిర్మించింది. హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో నాలెడ్జ్ సిటీ పక్కన దీనిని ఏర్పాటు చేసింది. 5.8 లక్షల చదరపు అడుగుల విస్త్రీర్ణంలో ఉన్న ఈ భవనం.. 4,000 పైగా స్టార్టప్ కంపెనీలు పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

