Laddu Adulterated Ghee: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై (Laddu Adulterated Ghee) సీబీఐ స్పెషల్ టీమ్ (CBI SIT) దర్యాప్తు ముగిసిన విషయం తెలిసిందే. దగ్గరదగ్గర 15 నెలలపాటు దర్యాప్తు జరిపిన సిట్.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు 12 రాష్ట్రాల్లో నకిలీ నెయ్యి సరఫరాకు సంబంధమున్న వ్యక్తులు, సంస్థలను గుర్తించి, అన్ని కోణాల్లో ప్రశ్నించింది. దర్యాప్తు ముగియడంతో నెల్లూరులోని స్థానిక కోర్టులో సిబీఐ బృందం శుక్రవారం నాడు ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే, ఈ ఛార్జిషీట్‌లోని అంశాలు విపక్ష వైసీపీకి ఆయుధంగా మారాయా?, కల్తీ నెయ్యి వ్యవహారంలో ఫక్తు రాజకీయం నడిపారంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఇరుకున పెట్టేందుకు అవకాశం దొరికిందా?.. అంటే ఔననే అంటున్నాయి ఫ్యాన్ పార్టీ వర్గాలు.
ఛార్జిషీటులో ఏముంది?
ఛార్జిషీటు వివరాల ప్రకారం, అసలు పాలు లేకుండానే నెయ్యి తయారు చేశారని, పామాయిల్‌లో రసాయనాలు కలిపి కల్తీ నెయ్యి తయారు చేశారని సిట్ తేల్చిచెప్పింది. పామాయిల్, కెమికల్ కలిపిన ద్రవాన్ని వాడారని సమగ్రంగా వివరించింది. లడ్డూ తయారీలో గానీ, కల్తీ నెయ్యి తయారీలో గానీ జంతుకొవ్వు వాడినట్టుగా సిట్ ఎక్కడా పేర్కొనలేదు. అసలు ఆ ప్రస్తావన కూడా ఛార్జిషీట్‌లో లేదు. దీంతో, ఈ పాయింట్‌ను వైసీపీ అస్త్రంగా మార్చుకోవడానికి సిద్ధమైంది.
Read Also- KTR – Janasena Party: కేటీఆర్ ఇలాకాపై జనసేన కన్ను.. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ.. హీటెక్కిన రాజకీయం!
శ్రీవారే వచ్చి న్యాయం వైపు నిలబడ్డారు
తిరుమల లడ్డూ వ్యవహారంలో మొదటి నుంచి డిఫెన్సివ్ మోడ్‌లో కనిపించిన విపక్ష వైసీపీ.. ఇప్పుడు కూటమి ప్రభుత్వ పెద్దలపై విమర్శల దాడికి దిగింది. శ్రీవారి ప్రతిష్టను దిగజార్చుతున్నామన్న సోయి కూడా లేకుండా, లడ్డూలో జంతుకొవ్వు వాడారంటూ ప్రచారం చేశారని, ఇప్పుడేం సమాధానం చెబుతారని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ లబ్ధి కోసం ఆంధ్రప్రదేశ్ గౌరవం, దేశం ముందు పరువు పోయేలా చేశారంటూ విమర్శలకు దిగాయి. ‘‘ఎంత కిందకి లాగాలని చూసినా.. తొక్కేయాలని చూసినా శ్రీ వారే వచ్చి న్యాయం వైపు నిలబడ్డారు. నిజంగా సత్యమే గెలిచింది. సత్యమేవ జయేతే!’’ అంటూ వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Read Also- Dhanush Mrunal: వైరల్ అవుతున్న ధనుష్, మృణాల్ పెళ్లి వీడియో!.. అతిథులు ఎవరంటే?
పవన్‌పై స్పెషల్ టార్గెట్!
తిరుమల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు వాడారంటూ వచ్చిన ఆరోపణలను ఇప్పుడు గట్టిగా తిప్పికొట్టాలని వైసీపీ భావిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. జంతుకొవ్వు కలిసిన తిరుమల లడ్డూలను ఆయోధ్యకు కూడా పంపించారంటూ నాడు పవన్ అన్నారని గుర్తుచేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఆవు, పంది కొవ్వుతో పాటు ఫిష్ అయిల్ కలిపారంటూ పవన్ అన్నారని ప్రస్తావిస్తున్నారు. ఏమీ తెలియకుండా ఎలా మాట్లాడారంటూ నిలదీస్తూ పోస్టులు పెడుతున్నారు. హిందువులకు ఆయన ఇప్పుడు క్షమాపణలు చెబుతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
దేవుడు సత్యం వైపే నిలబడతారని వైసీపీ మద్దతుదారులు అంటున్నారు. జంతుకొవ్వు కలిసినట్టుగా దర్యాప్తులో ఎక్కడా తేలలేదని, అలాగే వైసీపీ నాయకుల పేర్లు కూడా ఈ వ్యవహారంలో లేవని సమర్థించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు చేసిన నిరాధారమైన ఆరోపణల బాగోతం బయటపడిందని వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ‘మా నాయకుడు జగన్ తప్పు చేయలేదు’ అని సమర్థించుకుంటూ పోస్టులు పెడుతున్నాయి. అయితే, కూటమి పార్టీల మద్దతుదారుల వైఖరి వేరేలా ఉంది. నెయ్యి కల్తీ అయ్యినట్టుగా తేలింది కదా!, దానికి సమాధానం లేదా? మరి ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఈమేరకు కూటమి మద్దతుదారులు కౌంటర్ల కామెంట్లు పెడుతున్నారు. మరి, నెయ్యిలో జంతుకొవ్వు కలవలేదంటూ వైసీపీ సంధిస్తున్న విమర్శనాస్త్రాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?, ఆ పార్టీ శ్రేణుల వద్ద సమాధానాలు ఉన్నాయా? అనేది వేచిచూడాలి మరి!!.
మీ రాజకీయ లబ్ధి కోసం మన ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని దేశం ముందు పరువు పోయేలా చేశారు @ncbn @PawanKalyan 💦 pic.twitter.com/ZicAECB0Hg
— Rohit_Ysrcp (@Rohit_Ysrcp) January 24, 2026

