Bangladesh – ICC: త్వరలో జరగబోయే పురుషుల టీ-20 ప్రపంచకప్ కోసం భారత్ లో పర్యటించబోమంటూ బంగ్లాదేశ్ బుకాయించడంతో ఐసీసీ కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత్ లో క్రికెట్ ఆడితే తమ ప్లేయర్లకు భద్రత ఉండదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఆరోపిస్తోంది. అయితే బీసీబీ సూచలను ఏమాత్రం పట్టించుకోని ఐసీసీ.. భారత్ లో ఆడతారా? మీ స్థానంలో మరొక జట్టును ఆడించాలా? అంటూ తుది నిర్ణయాన్ని బీసీబీకే వదిలేసింది. అయితే టోర్నీ నుంచి నిష్క్రమించడానికే బంగ్లాదేశ్ సిద్ధమవుతుండటంతో ఆ జట్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐసీసీ ఛైర్మన్ జై షా నిర్ణయించినట్లు సమాచారం.
అసలేంటి లొల్లి..
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా.. దేశం విడిచి పారిపోయినప్పటి నుంచి ఆ దేశంలో భారత వ్యతిరేక వైఖరి బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో అక్కడ మైనారిటీలైన హిందువులపై మూకలు విచక్షణా రహితంగా దాడులు చేస్తూ హత్య చేస్తున్నాయి. అయితే దీనిపై భారత ప్రజలతో పాటు, కేంద్ర ప్రభుత్వం సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ కారణాల రిత్యా రెండు దేశాల మధ్య గతంతో పోలిస్తే సత్సంబంధాలు తీవ్రంగా దెబ్బతీన్నాయి. దీంతో ఐపీఎల్ కోసం కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజర్ ను కేకేఆర్ (KKR) జట్టు తప్పించింది. దీంతో భారత్ – బంగ్లా వివాదం క్రికెట్ వైపునకు మళ్లింది. బంగ్లాదేశ్ క్రీడాకారుల పట్ల భారత్ అమానవీయంగా ప్రవర్తిస్తోందని.. ఆ దేశంలో క్రికెట్ ఆడటానికి వెళ్తే తమ ప్లేయర్ల భద్రతకు గ్యారంటీ ఉండదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆరోపిస్తోంది.
ముప్పు లేదని తేల్చేసిన ఐసీసీ టీమ్..!
అయితే బంగ్లా బోర్డ్ చేసిన ఆరోపణలపై అంతర్జాతీయ భద్రతా నిపుణుల చేత రిస్క్ అసెస్మెంట్ ను ఐసీసీ చేయించింది. అయితే ఆ దేశం ఆరోపిస్తున్నట్లుగా భారత్ లో బంగ్లా ప్లేయర్లకు వచ్చిన ముప్పు ఏమీ లేదని ఆ బృందం తేల్చి చెప్పింది. కాబట్టి బంగ్లా కోరుకుంటున్నట్లు భారత్ లో కాకుండా మరో వేదికకు మ్యాచ్ లను మార్చాల్సిన అవసరం లేదని జై షా నేతృత్వంలోని ఐసీసీ స్పష్టం చేసింది. దీంతో బంగ్లాదేశ్ కోసం టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ లో ఎలాంటి మార్పు చేయబోమని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఆడాలో లేదో బంగ్లాదేశ్ నిర్ణయించుకోవాలని తెగేసి చెప్పింది. ఆ జట్టు ఆడని పక్షంలో వారి స్థానంలో టీమ్ ను వరల్డ్ కప్ ఆడిస్తామంటూ తేల్చి చెప్పింది.
Also Read: Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై.. మాట మార్చిన కేటీఆర్.. సిట్ దెబ్బకు భయపడ్డారా?
బంగ్లా బోర్డుపై కఠిన చర్యలు
ఈ క్రమంలో గురువారం బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం మాట్లాడుతూ.. తమ అభ్యర్థనను తిరస్కరించిన కారణంగా భారత్ లో టీ20 వరల్డ్ కప్ ఆడకూడదన్న నిర్ణయంపై తాము గట్టిగా ఉన్నామని ప్రకటించారు. భారత్ లో తమ ప్లేయర్లకు వచ్చిన ముప్పు ఏం లేదని తమను కన్విన్స్ చేయడంలో ఐసీసీ విఫలమైందని పేర్కొన్నారు. దీంతో బంగ్లా వరల్డ్ కప్ నుంచి తప్పుకునే సూచనలు మెండుగా కనిపిస్తుండటంతో ఐసీసీ ఛైర్మన్ కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు ఐసీసీ వర్గాలు ప్రకటించాయి. ఈ అంశంపై తుది నిర్ణయం కోసం ఆయన దుబాయిలో ఉన్నారని పేర్కొన్నారు. అయితే బంగ్లా బోర్డుకు భారీ ఫైన్ విధించే యోచనలో ఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బ్రాడ్ కాస్టింగ్, స్పాన్సర్స్ నష్టాలకు ఆ జట్టునే బాధ్యత వహించేలా చేయనున్నట్లు సమాచారం. భవిష్యత్ ఐసీసీ ఈవెంట్లలో ఆ జట్టు నేరుగా ఆడే అర్హతను కూడా పరిశీలించవచ్చని తెలుస్తోంది. టీ20 ర్యాంకింగ్ పాయింట్లలో కోత పడే ఛాన్స్ ఉన్నట్లు క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

