GHMC Elections: ముందు నుంచే అశావాహుల టికెట్ల ప్రయత్నాలు
300 వార్డుల్లో రోజురోజుకి పెరుగుతున్న ఆశావాహులు
మళ్లీ టికెట్ ప్రయత్నాలు మొదలు పెట్టిన సిట్టింగ్ కార్పొరేటర్లు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌లోని పట్టణ స్థానిక సంస్థల విలీనంతో విస్తరించిన జీహెచ్ఎంసీ పరిధిలో (GHMC Elections) రాజకీయం ఒక్కసారిగా వేడెక్కుతుంది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న పాలక మండలి అధికార గడువు వచ్చే నెల 10వ తేదీతో ముగియనున్నందున కౌంట్ డౌన్ పెరుగుతున్న కొద్దీ రాజకీయ వేడి రాజుకుంటుంది. ఒక వైపు జీహెచ్ఎంసీ బయటున్న మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు అన్ని రకాలుగా లైన్ క్లియర్ కావటంతో త్వరలోనే షెడ్యూల్ జారీ చేసి, ఆ తర్వాత 45 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగనున్నట్లు రాజకీయ వర్గాల్లో వాడీవేడీ చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న 150 మున్సిపల్ వార్డుల కార్పొరేటర్లతో కూడిన పాలక మండలిలోని వివిధ పార్టీలకు చెందిన సభ్యులు సైతం ఇప్పటి నుంచే టికెట్లను దక్కించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా ఆశావాహుల్లో సింహాభాగం నేతలు అధికార కాంగ్రేస్ పార్టీ టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది.
Read Also- Vijayasai Reddy: రాజకీయాలపై విజయసాయి రెడ్డి యూ-టర్న్.. సంచలన నిర్ణయం.. జగన్ కోర్టులో బంతి!
ముఖ్యంగా హైదరాబాద్ కోర్ సిటీలోని అత్యధిక వార్డుల్లో ఎంఐఎం ప్రాబల్యం ఎక్కువగా ఉన్నందున ఈ సారి అత్యధిక వార్డుల్లో ఆ పార్టీ గెలుపొందే అవకాశాలున్నట్లు తెలిసింది. వచ్చే నెల 10 వ తేదీ తర్వాత తాజాగా మాజీలు కానున్న ప్రస్తుత వివిధ పార్టీలకు చెందిన కార్పొరేటర్లలో ఎక్కువ మంది కూడా అధికార పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. కోర్ సిటీలోని వార్డులకు సైతం ఒక్కో వార్డు టికెట్ కోసం ఏకంగా ముగ్గురు నలుగురు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వార్డులకు సంబంధించి ఇంకా రిజర్వేషన్లు ఖరారు కాకముందే ఆశావాహులు వార్డులను ఎంచుకుని ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది. మండల, నియోజకవర్గం, వార్డు స్థాయి నేతలు టికెట్ కోసం తన గాడ్ ఫాదర్స్ చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెట్టినట్లు తెలిసింది.
శివార్ల వార్డులకు పెరుగుతున్న ఆశావాహులు
27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో పునర్విభజించిన జీహెచ్ఎంసీ పరిధి మొత్తం 300 వార్డులకు పెరగటంతో శివార్లలోని 150 వార్డులకు ఇప్పటి నుంచే ఒక్కో పార్టీ నుంచి నలుగురైదుగురు వివిధ పార్టీల నుంచి టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. శివారులోని వార్డుల నుంచి టికెట్లు ఆశించే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో విలీనమైన పట్టణ స్థానిక సంస్థల పునర్విభజనతో ఏర్పడిన కొత్త వార్డుల్లో టికెట్లు ఆశిస్తున్న నేతలు వార్డు సరిహద్దులు, మొత్తం ఓటర్ల సంఖ్య, రిజర్వేషన్, సామాజికవర్గాల వారీగా ఓటర్ల వివరాలను లెక్కలేయటంలో బిజీగా ఉన్నారు. మొత్తం 300 మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లతో పాటు మూడు కార్పొరేషన్ల ఏర్పాటు, వార్డు మెంబర్, చైర్ పర్సన్ల సీటు రిజర్వేషన్లు ప్రక్రియ ఫిబ్రవరి 10 తేదీ తర్వాత సర్కారు ఇచ్చే క్లారిటీ కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 300 మున్సిపల్ వార్డుల సరిహద్దులను జీహెచ్ఎంసీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచిన సమాచారంతో వర్కవుట్ చేసుకుంటున్న ఆశావాహులు రిజర్వేషన్లపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు.

