RTC Bus Accident: కొత్త సంవత్సరం తొలి రోజే హైదరాబాద్‌లో విషాదకర ఘటన
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. కొత్త సంవత్సరం మొదటి రోజున కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుదామని ట్యాంక్ బండ్‌కు బయల్దేరిన భార్యాభర్తలను తిరిగి రాని లోకాలకు వెళ్లారు. వారి కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదం గురువారం రాత్రి మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన వెంకటమ్మ, తిరుపతి రావు భార్యాభర్తలు. దిల్‌సుఖ్‌నగర్ కొత్తపేటలో వీరి కూతురు, అదే ప్రాంతంలో కొడుకు అశోక్ నివాసముంటున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తిరుపతిరావు, వెంకటమ్మలు కూతురి ఇంటికి వచ్చారు. తల్లిదండ్రులు రావటంతో అశోక్ కూడా తన భార్యతో కలిసి అక్కడికి వెళ్లాడు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ట్యాంక్ బండ్ వెళ్లి సరదాగా కాసేపు గడుపుదామని అంతా కలిసి ఇంటి నుంచి బయల్దేరారు.
తిరుపతి రావు, వెంకటమ్మ ఓ స్కూటీపై, వారి కొడుకు, కోడలు మరో బైక్‌పై, కూతురు-అల్లుడు ఇంకో టూ వీలర్‌పై ప్రయాణమయ్యారు. మూసారాంబాగ్ ప్రాంతానికి చేరుకోగానే వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టింది. భార్యాభర్తలిద్దరూ అదుపు తప్పి కింద పడపోయారు. బస్సు వెనక చక్రాలు పైనుంచి బస్సు దూసుకెళ్లటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. విషయం తెలియగానే ప్రమాద స్థలానికి చేరుకున్న మలక్ పేట పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసులు నమోదు చేసి ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Read Also- GHMC Payments: అక్రమాలకు చెక్.. బల్దియాలో నగదు చెల్లింపులు బంద్.. కమిషనర్ సంచలన ఆదేశాలు
అమ్మానాన్నలు లేకుండా పోయారు…
ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం తమకు అమ్మానాన్నలు లేకుండా చేసిందంటూ అశోక్ కన్నీరుమున్నీరయ్యాడు. ట్యాంక్ బండ్‌కు అందరం కలిసి బయల్దేరామని, తాను కొద్దిగా ముందు ఉన్నట్టు చెప్పాడు. ఏంటీ ఇంకా రావట్లేదని తన తండ్రి మొబైల్‌కు ఫోన్ చేయగా అవతలి వైపు నుంచి మాట్లాడిన వ్యక్తి యాక్సిడెంట్ జరిగిందని, ఇద్దరూ చనిపోయారని చెప్పాడన్నారు. దాంతో వెనక్కి వెళ్లి చూడగా తన తల్లిదండ్రులు చనిపోయి కనిపించారని కన్నీటి పర్యంతమయ్యాడు. బస్సు వెనుక చక్రాలు తన తల్లి తల పైనుంచి వెళ్లటంతో మెదడు బయట పడిందని, అది చూసి తన తండ్రి గుండెపోటుకు గురై మరణించాడని విలపించారు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నాడు.
Read Also- Lady Constable: లేడీ కానిస్టేబుల్ దుస్తులు చింపేసిన నిరసనకారులు.. షాకింగ్ వీడియో వైరల్

