Illegal Construction: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని సవారాన్ స్ట్రీట్‌లో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న భవన నిర్మాణంపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌లకు వినతులు అందినప్పటికీ చర్యలు ఎందుకు శూన్యం? ఇంటి నంబర్ 3-2-45 యజమానులు ఎటువంటి మున్సిపల్ అనుమతులు లేకుండా, కేవలం 9 అడుగుల గల్లీలో జి+4 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తూ స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏడాది కాలంగా నిబంధనలను అతిక్రమించి బాల్కనీలను రోడ్డుపైకి పెంచడమే కాకుండా, డ్రైనేజీ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి మురుగు నీరు పొరుగు ఇళ్లలోకి వచ్చేలా చేస్తున్నా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నాజియా, అసిస్టెంట్ కమిషనర్ బషీర్‌లు ఎందుకు స్పందించడం లేదు?
Also Read: Fan Wars: ‘జల్సా’ రీ రిలీజ్.. థియేటర్‌లో మహేష్ అభిమానిపై పవన్ ఫ్యాన్స్ దాడి!
15 ఏళ్ల క్రితం నాటి పాత నోటీసులు
అక్రమ నిర్మాణంపై మూడు సార్లు నోటీసులు ఇచ్చామని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పనులు ఆగకుండా కొనసాగుతుండటం వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందా లేక అక్రమార్కుల బలం ఉందా? న్యాయం చేయాలని ఫిర్యాదు చేసిన బాధితుడు ముస్తఫా అన్వర్‌పైనే 15 ఏళ్ల క్రితం నాటి పాత నోటీసులు పంపిస్తూ, అక్రమ భవన యజమానులతో ఒప్పందం చేసుకోవాలని అధికారులు ఒత్తిడి తెస్తుండటం ఎంతవరకు సమంజసం? నగరపాలక సంస్థలో రెగ్యులర్ మేయర్ లేకపోవడం, అధికారులు అదనపు బాధ్యతలతో ఉండటాన్ని ఆసరాగా చేసుకొని అక్రమార్కులు రెచ్చిపోతుంటే ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తారా? వినతులు అందుకున్న జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటుందా లేక అక్రమ నిర్మాణాలకు కొమ్ముకాస్తుందా? సవారాన్ స్ట్రీట్ వాసులకు న్యాయం జరిగే వరకు ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించే నాథుడే లేరా? అధికారులు ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ అక్రమ నిర్మాణాన్ని అడ్డుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి.
Also Read: BRS: బీఆర్ఎస్‌కు పీడ కలగా 2025 సంవత్సరం.. అంతా అరిష్టమే..!

