Urea Monitoring: రాష్ట్రంలో యాసంగి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు యూరియా కొరత తలెత్తకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. యూరియా పంపిణీని పర్యవేక్షించేందుకు, అక్రమాలను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ తొమ్మిది మంది ప్రత్యేక అధికారులను నియమించింది. వీరు బుధవారం తమకు కేటాయించిన జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి, పీఏసీఎస్ సెంటర్లు, ప్రైవేట్ డీలర్ షాపులు, మార్క్ ఫెడ్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
క్షేత్రస్థాయిలో ముమ్మర సోదాలు
ప్రత్యేక అధికారులు విజయ్ కుమార్, నరసింహారావు, గీత, ఆశ కుమారి, సుచరిత, బాలు, శైలజ, చంద్రశేఖర్, కనకరాజులు క్షేత్రస్థాయిలో పర్యటించి స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. కొన్ని చోట్ల రైతులు గంటల తరబడి క్యూలో నిలుచుంటున్నారని, మరికొన్ని చోట్ల ప్రైవేట్ వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని వస్తున్న ఫిర్యాదులపై అధికారులు ఆరా తీశారు. స్వయంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కృత్రిమ కొరత సృష్టించినా లేదా ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువకు విక్రయించినా డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Also Read: Bank Holidays 2026: 2026లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు? ఆర్‌బీఐ ప్రకటించిన పూర్తి క్యాలెండర్
పకడ్బందీగా మానిటరింగ్
హైదరాబాద్‌లోని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయం కేంద్రంగా ఉన్నతాధికారులు నిత్యం యూరియా సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. ఏ జిల్లాలో ఎంత డిమాండ్ ఉందో తెలుసుకుని, దానికి అనుగుణంగా నిల్వలను తరలించేలా చర్యలు చేపట్టారు. ప్రతిరోజూ జరిగే అమ్మకాలు, నిల్వలకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వానికి నివేదించనున్నారు. మరో వైపు, జిల్లా కలెక్టర్లు సైతం తమ పరిధిలో యూరియా పంపిణీపై నిరంతరం నిఘా ఉంచాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
నిల్వలు పుష్కలంగా ఉన్నాయి : డైరెక్టర్ గోపి
రాష్ట్రంలో యూరియా నిల్వలకు ఎలాంటి కొరత లేదని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి స్పష్టం చేశారు. రైతుల అవసరాలకు అనుగుణంగా సరఫరా చేస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. యూరియా పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశామని, ఏ రోజుకు ఆ రోజు నివేదికలు తెప్పించుకుంటున్నామని వెల్లడించారు. ఇదే సమయంలో అధిక యూరియా వాడకం వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరిస్తూ అధికారులతో అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

