Alleti Maheshwar Reddy: మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాకు చూపిస్తున్న డాక్యుమెంట్లు అన్నీ ఫేక్ అని, ఆయన చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ, కృష్ణా నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు బనకచర్ల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టుకు అసలు సీడబ్ల్యూసీ అప్రూవలే లేదని ఆయన స్పష్టం చేశారు. నాడు కేసీఆర్ 299 టీఎంసీలకు సంతకం చేసి తెలంగాణకు తీరని అన్యాయం చేశారని, ఇప్పుడు ఆ నెపాన్ని ఇతరులపైకి నెట్టేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
కుమ్మక్కు రాజకీయాలు..
రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఏలేటి ఆరోపించారు. మూడో శక్తి ఎదగకుండా ఉండేందుకు ఐదేళ్లు ఒకరు, మరో ఐదేళ్లు ఇంకొకరు అధికారంలో ఉండాలని ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ‘బయట రేవంత్ రెడ్డి తొండలు జొర్రగొడతాం అంటారు.. కానీ, అసెంబ్లీకి రాగానే వంగి వంగి దండాలు పెడుతుంటారు’ అని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా, సభకు రాని నాయకుడు చెప్పిన అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి సమయం ఎక్కడిదని ప్రశ్నించారు.
ప్రాజెక్టుల్లో వైఫల్యాలు..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ చేసిన తప్పిదాల వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఏలేటి పేర్కొన్నారు. నాడు రోజుకు 2 టీఎంసీల తరలింపుతో మొదలై, నేడు ఏపీ రోజుకు 10 టీఎంసీల నీటిని తరలించుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ ద్వారా తెలంగాణకు కేవలం 5-6 లక్షల ఎకరాల సాగునీరు అందుతుంటే, ఏపీ మాత్రం 18 నుంచి 20 లక్షల ఎకరాలకు నీటిని తీసుకెళ్తోందని వివరించారు. బీఆర్ఎస్ నేతల అవినీతిపై ఆధారాలు ఉన్నా రేవంత్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత స్మార్ట్‌గా అవినీతి చేసినా, ఎక్కడ సంతకాలు చేయకపోయినా ఏదో ఒక రోజు దొరికిపోవడం ఖాయమని ఏలేటి హెచ్చరించారు.
Also Read: Switzerland: న్యూయర్ వేడుకల్లో భారీ పేలుడు.. ఎగసిపడ్డ మంటలు.. చెల్లాచెదురుగా మృతదేహాలు

