TG ACB Rides: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తన పనితీరులో దూకుడు పెంచింది. గతంతో పోలిస్తే 2025 సంవత్సరంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేసి అవినీతి అధికారుల గుండెల్లో వణుకు పుట్టించింది. ఈ ఏడాది మొత్తం 199 కేసులు నమోదు కాగా, వివిధ శాఖలకు చెందిన 273 మంది అధికారులను ఏసీబీ కటకటాల్లోకి పంపింది. వీరిలో కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన మాజీ ఈఎన్సీలతో పాటు, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కీలక రవాణా శాఖ అధికారి ఉండటం గమనార్హం. కేవలం అరెస్టులకే పరిమితం కాకుండా, అరెస్టయిన వారిలో 115 మంది అధికారులపై ప్రాసిక్యూషన్ కోసం ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించి, కోర్టుల్లో ఛార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. ఏ శాఖ చూసినా ఏమున్నది గర్వ కారణం.. సమస్తం అవినీతిమయం అన్నట్టుగా ఆయా డిపార్ట్‌మెంట్ల పనితీరు తయారైన విషయం అందరికీ తెలిసిందే. చివరికి డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నా అవినీతికి మరిగిన అధికారుల చేయి తడపనిదే పని జరగట్లేదు.
157 కేసులు ట్రాప్ చేసినవే..
ఆమ్యామ్యాలకు చెక్ పెట్టటానికి చాలా సేవలను ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చినా ప్రైవేట్ వ్యక్తులను ఏజెంట్లుగా పెట్టుకుని పై సంపాదనలకు మరిగిన అధికారులు నాలుగు చేతులా సంపాదిస్తున్నారు. దీనికి సబ్ రిజిస్ట్రార్, ఆర్టీఏ కార్యాలయాలను ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఈ క్రమంలో అవినీతికి చెక్ పెట్టటానికి ఏసీబీ ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలంటూ హెల్ప్ లైన్ నెంబర్‌తో ఉన్న సైన్ బోర్డులను అందరికీ కనిపించేలా పెడుతున్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే అధికారులు రంగంలోకి దిగి లంచాలు తీసుకుంటున్న వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. 2025లో 199 కేసులు నమోదు కాగా, వాటిలో 157 కేసులు ట్రాప్చేసినవే ఉండటం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇలా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారుల నుంచి రూ. 57.17లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నుంచి రూ. 35.89 లక్షల నగదును ఫిర్యాదీదారులకు వాపసు ఇచ్చారు.
Also Read: Anvesh Controversy: యూట్యూబర్ అన్వేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి.. ఎందుకంటే?
పక్కా సమాచారంతో..
ఇక, ఏసీబీ అధికారులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల రూపాయల ఆస్తులు పోగేసుకున్న అధికారుల భరతం కూడా పడుతున్నారు. 2025లో అక్రమాస్తులకు సంబంధించి 15 కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ప్రైవేట్ మార్కెట్ రేటు ప్రకారం ఈ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ వందల కోట్లలో ఉండటం గమనార్హం. ఇక, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆర్టీఏ ఆఫీసు, వెల్ఫేర్హాస్టళ్లతో పాటు అవినీతి జాడ్యం బాగా పెరిగిందన్న శాఖల్లో 2025లో 54 ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఏసీబీలో పని చేస్తున్న వారిలో 73 మంది అధికారులకు 2025లో స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఆయా కేసుల్లో అరెస్టయిన నిందితుల ప్రొఫైళ్ల తయారీ, అనుమానాస్పద అధికారుల వివరాలు ఎలా సేకరించాలన్న దానిపై శిక్షణ ఇచ్చారు. దాంతో పాటు అవినీతికి మరిగిన అధికారులపై నిఘా ఎలా పెట్టాలి? బినామీ ఆస్తులను ఎలా గుర్తించాలి? ఆర్థిక లావాదేవీల్లో డిజిటల్ ఫుట్ ప్రింట్లను ఎలా సేకరించాలి? అన్న దానిపై ఫోకస్‌పెట్టారు.
యాంటి కరప్షన్వీక్..
ప్రజలు పూర్తిస్థాయిలో సహకారం అందించినప్పుడే అవినీతి అధికారుల ఆట కట్టించటం సాధ్యమవుతుందని ఏసీబీ డీజీ చారూ సిన్హా తెలిపారు. దీనికోసం డిసెంబర్ 3 నుంచి వారం రోజులపాటు యాంటీ కరప్షన్వీక్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశామన్నారు. ఇందులో భాగంగా అవినీతి అధికారులకు సంబంధించి సమాచారాన్ని అందించాల్సిన ప్రాధాన్యత, ఎలా ఫిర్యాదు చేయాలన్న దానిపై విస్తృతమైన అవగాహన కల్పించినట్టు తెలిపారు. ఎవరు లంచం డిమాండ్ చేసినా 1064 నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. అంతేకాకుండా ఫిర్యాదులు ఇవ్వడానికి క్యూ ఆర్ కోడ్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా కూడా బాధితులు ఫిర్యాదులు చేయవచ్చన్నారు. 9440446106 నెంబర్‌కు వాట్సప్ కూడా చేయవచ్చన్నారు. . అవినీతికి పాల్పడే వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు.
Also Read: Dhurandhar Movie: అలా జరిగినందుకు రూ.90 కోట్ల వరకూ నష్టపోయిన ‘దురంధర్’ సినిమా.. ఎందుకంటే?

