Anaganaga Oka Raju: ఈసారి సంక్రాంతి బరిలో భారీ పోటీ ఉన్న విషయం తెలిసిందే. ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ‘ది రాజా సాబ్’గా ఈ బరిలోకి దిగుతున్నారు. ఆ తర్వాత వరసగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగ ఒక రాజు’ (Anaganaga Oka Raju) సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇవి కాకుండా మధ్యలో రెండు తమిళ సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. అందులో ఒకటి దళపతి విజయ్ చివరి సినిమా ‘జననాయగన్’, రెండోది శివకార్తికేయన్ ‘పరాశక్తి’. ప్రస్తుతం ఈ చిత్రాల మేకర్స్ ప్రమోషన్లను యమా కోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో ఎవరినీ కదిలించినా, సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు పెద్ద విజయం సాధించాలని, అందులో మా సినిమా కూడా ఉండాలని కోరుకుంటున్నారు. తాజాగా నవీన్ పొలిశెట్టి కూడా ఈ భారీ పోటీపై స్పందించారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో ‘రాజు గారి పెళ్లి రిసెప్షన్ వేడుక’ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) మాట్లాడుతూ..
Also Read- Chiranjeevi: తమిళ స్టార్ దర్శకుడితో మెగాస్టార్ చిరంజీవి సినిమా.. నిజమేనా?
అన్నా సినిమా ఎప్పుడు?
‘‘రాబోయే నూతన సంవత్సరం 2026 అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2024 అనేది నా జీవితంలో చాలా క్లిష్టమైన సంవత్సరం. అంతకు ముందు వరుసగా మూడు విజయాలు అందుకున్న తర్వాత.. అదే ఉత్సాహంలో మరో అదిరిపోయే సినిమాని తీసుకొద్దామని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో.. ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్‌తో నేను షూటింగ్‌కి దూరమయ్యాను. ఆ ప్రమాదం నుంచి కోలుకోవడానికి మానసికంగా, శారీరకంగా చాలా సమయం పట్టింది. అదే సమయంలో మా బృందంతో కలిసి ఈ ‘అనగనగా ఒక రాజు’ కథ రాసుకోవడం జరిగింది. 2025 ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలుపెట్టాం. ఆ టైమ్‌లో ‘అన్నా సినిమా ఎప్పుడు?’ అని చాలామంది మెసేజ్‌లు చేసేవారు. అభిమానుల, ప్రేక్షకులందరి ప్రేమ, మద్దతు వల్లే నేను త్వరగా కోలుకోగలిగాను. ఈ సందర్భంగా అందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను.
Also Read- Anil Ravipudi: శివాజీ వ్యాఖ్యలపై ఆసక్తికరంగా స్పందించిన అనిల్ రావిపూడి.. ఏమన్నారంటే?
అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలి
‘అనగనగ ఒక రాజు’ సినిమా చాలా బాగా వచ్చింది. ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాను ఎప్పుడు విడుదల చేద్దామనే చర్చ వస్తే.. సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుందని మా నిర్మాతలు భావించారు. నేనూ ప్రేక్షకుల నుంచి వచ్చిన వాడినే. ఒకప్పుడు నేను ఏ హీరోల సినిమాలైతే థియేటర్స్‌కి వెళ్లి చూసేవాడినో.. ఇప్పుడు అదే అభిమాన హీరోల సినిమాలతో పాటు, నా సినిమా కూడా విడుదలవుతుండటం చాలా సంతోషంగా ఉంది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. సంక్రాంతికి సినిమా అంటేనే వినోదం. సంక్రాంతిలో ఒక వైబ్ ఉంటుంది. నేను, మీనాక్షి సహా టీమ్ అందరం మనసు పెట్టి ఈ సినిమాకు పనిచేశాం. జనవరి 14న విడుదలవుతున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రాన్ని అందరూ కుటుంబంతో కలిసి వచ్చి చూసి ఆనందించాలని కోరుతున్నాను. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు’, రెబల్ స్టార్ ‘ది రాజా సాబ్’తో మాస్ రాజా, శర్వానంద్.. ఇలా అన్ని సినిమాలు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్ని మంచి సినిమాలతో ఈసారి సంక్రాంతి నిజంగానే తెలుగు ప్రేక్షకులకు ఫెస్టివల్ వైబ్‌ని ఇస్తుందని, తెలుగు సినిమాల సౌండ్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా వినిపించాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments), ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ (Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

