Uttam Kumar Reddy: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పోరాటం ఫలితంగానే బనకచర్ల ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా గోదావరి జలాల మళ్లింపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ముమ్మాటికి అడ్డుకుంటామని, గోదావరి జలాశయాలలో తెలంగాణ వాటాను పరిరక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం విడుదల చేసిన మీడియా ప్రకటనలో ఏపీ ప్రభుత్వం మొదట రూపొందించిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ అడ్డుకోవడంతో, ఇప్పుడు ఆ ప్రాజెక్టు పేరును పోలవరం-నల్లమల్ల సాగర్‌గా మార్చి సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని విమర్శించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి నీటిని మళ్లించేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని ఆయన వెల్లడించారు. 1980 గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్ తీర్పు, ఏపీ పునర్విభజన చట్టం, కేంద్ర జలవనరుల సంఘం మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని ఉత్తమ్ ఆరోపించారు. కృష్ణా బేసిన్‌కు గతంలో అనుమతించిన 80 టీఎంసీల నీటి కంటే అదనంగా వినియోగించుకోవాలని ఏపీ చూస్తోందని, దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు.
మళ్లింపును అడ్డుకుంటాం..
ఈ అక్రమ ప్రయత్నాలను నిలువరించేందుకు న్యాయపరంగా పోరాడుతామని తెలిపారు. ఇందులో భాగంగానే జనవరి 22, 2025న కేంద్ర జలశక్తి శాఖకు, జూన్ 13, 16 తేదీలలో పర్యావరణ, అటవీ శాఖలకు లేఖలు రాశామని, ఏపీ ఉల్లంఘనలను ఎండగడుతూ వారి ప్రతిపాదనలను తిరస్కరించాలని డిమాండ్ చేశామని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలతో జూన్ 30, 2025న పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను తిరస్కరించిందని ఉత్తమ్ వెల్లడించారు. అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కారం కాలేదని, గోదావరి వాటర్ డిస్పుట్స్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, వరద నీటి లభ్యతపై సీడబ్ల్యుసీ అనుమతి తప్పనిసరని కమిటీ స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ, గోదావరి, కృష్ణా నది యాజమాన్య బోర్డులకు కూడా తెలంగాణ ప్రభుత్వం తన నిరసనను గట్టిగా వినిపించిందని తెలిపారు. జూలై 2025 ఉన్నత స్థాయి సమావేశంలో పెండింగ్ సమస్యలను అజెండాలో చేర్చాలని డిమాండ్ చేసినా, ఏపీ ప్రభుత్వం నవంబర్ 21న ఏకపక్షంగా టెండర్లు పిలవడంతో ప్రభుత్వం డిసెంబర్ 16, 2025న సుప్రీంకోర్టును (పిటిషన్ నెం.1258/2025) ఆశ్రయించిందని వివరించారు.
Also Read: TG ACB Rides: 2025 లో ఏసీబీ దూకుడు.. వందల కోట్ల అక్రమాస్తుల పూర్తి సమాచారం ఇదే..!
సుప్రీంకోర్టులో డిమాండ్లు
సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ‘పీబీఎల్‌పీ/పీఎన్ఎల్పీ పనులను తక్షణమే నిలిపివేయాలి. అనుమతులు లేని ఈ ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు నిధులు ఇవ్వకుండా చూడాలి. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన సామర్థ్య విస్తరణ టెండర్లను రద్దు చేయాలి’ అని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా మూడు అంశాలను కోరింది. గోదావరిలో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల నీటి హక్కులను కాపాడుకోవడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న ప్రతిపక్షాల విమర్శలు అసత్యమని కొట్టిపారేశారు. సుప్రీంకోర్టు ద్వారా ఏపీ ఏకపక్ష చర్యలను అడ్డుకుంటామని, రాష్ట్రాల మధ్య సంప్రదింపులు లేకుండా ఎలాంటి మళ్లింపు జరిగినా సహించబోమని మంత్రి తేల్చిచెప్పారు.
Also Read: Drunk And Drive Test: హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!

