GHMC Expansion: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్)లోని స్థానిక సంస్థల విలీనంతో పెరిగిన విస్తీర్ణం, జనాభాకు తగిన విధంగా పరిపాలన పరంగా, పౌర సేవల నిర్వహణ పరంగా జీహెచ్‌ఎంసీ పునర్ వ్యవస్థీకరించుకునే ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు తెలిసింది. గత నెల 25న గ్రేటర్ బయట, ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేస్తూ జారీ చేసిన ఆదేశాలతో మొదలైన డీలిమిటేషన్ హడావుడి ఇంకా కొనసాగుతూనే ఉంది. విలీనానికి ముందు జీహెచ్‌ఎంసీ పరిధిలో అందిస్తున్న పౌర, అత్యవసర సేవలు విలీన ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి వచ్చేలా కమిషనర్ చేపట్టిన పునర్ వ్యవస్థీకరణలో భాగంగా భారీ ప్రక్షాళన చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 27 పట్టణ స్థానిక సంస్థల ఆదాయ, వ్యయ వివరాలతో పాటు ఆస్తులు, సిబ్బందిని జీహెచ్‌ఎంసీలో విలీనం చేసుకున్నారు. విలీన ప్రాంతాల్లో మార్పు తీసుకువచ్చేందుకు ఈ నెల 29 నుంచి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నారు.
అనూహ్య నిర్ణయాలు..
కొత్తగా ఏర్పడిన 12 జోన్లకు జోనల్ కమిషనర్లను, సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్ల నియామకంలో కమిషనర్ అత్యంత పకడ్బందీగా వ్యవహరించారు. ఈ నియామకాలు, బదిలీల విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు చోటు ఇవ్వకుండా కమిషనర్ అనూహ్యంగా నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. నియామకాలు చేపట్టిన రోజున తన ఆదేశాలను విస్మరించిన కొందరు అధికారులపై కమిషనర్ ఏకంగా సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ప్రక్షాళనతో జీహెచ్‌ఎంసీలోని అన్ని విభాగాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. విలీన ప్రక్రియను పూర్తి చేసి పౌర సేవలను గాడిలో పెట్టడమే లక్ష్యంగా యంత్రాంగం ముందుకు సాగుతోంది.
కమిషనర్ కర్ణన్ మార్క్..
వివిధ విభాగాల వారీగా కమిషనర్ కర్ణన్ మార్పులు, చేర్పులు, కొత్తగా నియామకాలు వంటి ప్రక్రియలు చేపట్టేందుకు అదనపు కమిషనర్లు, విభాగాధిపతులను పిలిపించి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్ల విభాగాలకు చెందిన పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తి కాగా, స్పోర్ట్స్, ఎస్టేట్, అర్బన్ బయో డైవర్శిటీ(యూబీడీ) విభాగాల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ కూడా తుది దశలో ఉన్నట్లు తెలిసింది. విలీనానికి ముందు ఆయా పట్టణ స్థానిక సంస్థల్లో అన్ని రకాల సేవలు ఒకటి, రెండు విభాగాలతో అందించే వారు. కానీ, విలీనం తర్వాత విభాగాల వారీగా వింగ్‌లను ఏర్పాటు చేసి, స్థానికంగా ఉన్న సిబ్బంది, జీహెచ్ఎంసీలోని సిబ్బందిని కలిపి స్పెషల్ వింగ్‌లను ఏర్పాటు చేసేలా కసరత్తు కొనసాగుతోంది. గ్రేటర్ మహా నగర వాసులకు వివిధ సేవలందిస్తున్న అన్ని విభాగాలను మొత్తం 60 సర్కిళ్లలో పునర్ వ్యవస్థీకరించేందుకు కమిషనర్ తన కసరత్తును వేగవంతం చేశారు.
Also Read: Year Ender 2025: గుడ్ బై 2025.. ఈ ఏడాది జరిగిన ముఖ్య సంఘటనలపై స్వేచ్ఛ స్పెషల్..!
సిబ్బందికి పదోన్నతులు..
ఇందులో భాగంగానే అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లకు స్థానచలనం కల్గిస్తూ మంగళవారం కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల నియామకం వంటి కీలక దశలు ముగిసినా, ఇప్పుడు సర్కిళ్ల వారీగా ఆయా విభాగాల వింగ్‌లను ఏర్పాటు చేసే ప్రక్రియలో కూడా భారీగా ప్రక్షాళన చేయనున్నట్లు సమాచారం. కొత్తగా సిబ్బందిని నియమించుకుండా, విలీన ప్రాంతాల్లోని వారు, జీహెచ్ఎంసీ సిబ్బందిని కలిపి అవసరమైన చోట పదోన్నతులకు అర్హులైన వారికి ప్రమోషన్లు ఇచ్చి బాధ్యతలు అప్పగిస్తున్నారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల నియామకంలో ప్రక్షాళనను ముగించిన కమిషనర్, త్వరలోనే అదనపు కమిషనర్ల బాధ్యతల మార్పునకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

