Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో మంగళవారం రాత్రి తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. విష్ణుగడ్–పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్ట్‌కు చెందిన పిపల్కోటి టన్నెల్‌లో కార్మికులు, అధికారులు ప్రయాణిస్తున్న లోకో రైలు ఒక సరుకు రైలుతో ఢీకొనడంతో సుమారు 60 మంది గాయపడ్డారు.
ఈ ఘటన సమయంలో ఆ లోకో రైలులో మొత్తం 109 మంది ఉన్నట్లు చమోలీ జిల్లా కలెక్టర్ గౌరవ్ కుమార్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టగా, రైలులో ఉన్న వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారందరి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని తెలిపారు.
కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం, THDC (ఇండియా) నిర్మిస్తున్న ఈ జలవిద్యుత్ ప్రాజెక్ట్ టన్నెల్‌లో ఒక రైలు కార్మికులు, అధికారులను తరలిస్తుండగా, మరో రైలు నిర్మాణ సామగ్రిని మోస్తూ వెళ్తోంది. ఈ రెండు లోకో రైళ్లు టన్నెల్‌లో ప్రయాణిస్తున్న సమయంలో అనుకోకుండా ఢీకొన్నాయి.
Also Read: Huzurabad News: ప్రభుత్వ భూమిని కాపాడలేరా? అధికారులారా అంటూ.. మొలంగూరు నేతల ఘాటు విమర్శలు!
టన్నెల్ నిర్మాణ సమయంలో కార్మికులు, అధికారులు, అలాగే అవసరమైన సామాగ్రిని తరలించేందుకు ఈ తరహా లోకో రైళ్లను వినియోగిస్తారని అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిలో 10 మందిని గోపేశ్వర్ జిల్లా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించినట్లు చమోలీ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ వెల్లడించారు.
444 మెగావాట్ల సామర్థ్యం గల ఈ విష్ణుగడ్–పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్ట్ అలకనంద నదిపై, హెలాంగ్ నుంచి పిపల్కోటి మధ్య నిర్మాణంలో ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా నాలుగు టర్బైన్ల సహాయంతో విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే ఏడాదిలో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి.

