Pakistan: దాయాది దేశం పాకిస్థాన్‌లో (Pakistan) అంతర్గత పరిస్థితులు నానాటికీ మరింత దిగజారిపోతున్నాయి. అక్కడి అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థ, రాజకీయ అస్థిరత్వ పరిస్థితులు ఆ దేశంలోని విద్యావంతులను పునరాలోచనలో పడేస్తున్నాయి. భవిష్యత్ ప్రశ్నార్థకంగా కనిపిస్తుండడంతో చాలా విద్యావంతులు, వృత్తి నిపుణులు సొంత దేశానికి గుడ్‌బై చెప్పేస్తున్నారు. గడిచిన రెండేళ్ల వ్యవధిలో పెద్ద సంఖ్యలో పాకిస్థానీ విద్యావంతులు దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ జాబితాలో ఏకంగా 5000 మంది వైద్యులు, 11 వేల మంది ఇంజనీర్లు, 13 వేల మంది అకౌంటెంట్లు ఉన్నారంటూ పరిస్థితి తీవ్రత ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఈ గణాంకాలను స్వయంగా పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఒక రిపోర్టు విడుదల చేయగా, అది సంచలనంగా మారిపోయింది.
చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నైపుణ్యం ఉన్న వ్యక్తులు పెద్ద సంఖ్యలో ఆ దేశాన్ని వీడిపోతున్నారు. కీలకమైన డాక్టర్లు, ఇంజనీర్లు ఈ జాబితాలో ఉండడం పాక్‌లో ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఆర్థిక వ్యవస్త పతనం, రాజకీయ అస్థిరత్వం ఇందుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ రిపోర్టు విడుదలైన తర్వాత పాక్ ప్రభుత్వంతో పాటు ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌పై పాకిస్థానీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసిమ్ మునీర్ ఇటీవలే స్పందిస్తూ, విదేశాలకు వలస వెళ్లినవారు పెద్ద సంఖ్యలో వెనుదిరిగి స్వదేశానికి వస్తున్నారని ప్రకటించారు. కానీ, వాస్తవికంగా అలాంటి పరిస్థితి లేదని ప్రభుత్వం రిపోర్ట్ తేటతెల్లం చేసింది. దీంతో, పాకిస్థానీయులు మండిపడుతున్నారు.
ముందు రాజకీయాల్ని చక్కదిద్దండి
వృత్తి నిపుణులు పెద్ద సంఖ్యలో విదేశాలకు తరలి వెళ్తుండడంపై పాకిస్థాన్ సెనేటర్ ముస్తాఫా నవాజ్ ఖోఖర్ స్పందిస్తూ, ముందుగా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలని ప్రభుత్వానికి సూచించారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలంటే ముందుగా రాజకీయాలను సరిదిద్దాలని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఫ్రీలాన్సింగ్ హబ్‌గా పాకిస్థాన్ ఉందని, కానీ, ఇంటర్నెట్ సమస్యలు పెద్ద సమస్యగా మారాయన్నారు. ఇంటర్నెట్ షట్‌డౌన్ల కారణంగా ఏకంగా 1.62 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని ముస్తాఫా అన్నారు. అలాగే, ఇంటర్నెట్ షట్‌డౌన్ల కారణంగా 2.37 మిలియన్ మంది ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాలకు ముప్పు పొంచివుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అసలు డేటా ఏం చెబుతోంది?
పాకిస్థాన్ వలస తీరుతెన్నులను ‘పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ ఎమిగ్రేషన్ అండ్ ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్’ రిపోర్ట్ బహిర్గతం చేసింది. ఇటీవల విడుదలైన ఈ రిపోర్టు ఆ దేశం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులకు అద్దం పడుతోంది. 2024లో 727,381 మంది పాకిస్థానీయులు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిపోయినట్టుగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇక, ఈ ఏడాది నవంబర్ నాటికి ఆ సంఖ్య 687,246కి చేరినట్టు రిపోర్ట్ వెల్లడించింది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ వలసలు కేవలం గల్ఫ్ దేశాలకే పరిమితం కావడం లేదు. వృత్తి నిపుణుల వలసలు (Brain Drain) అన్నింటికంటే ఎక్కువగా వైద్య రంగంలో కనిపిస్తున్నాయి. 2011 నుంచి 2024 మధ్య కాలంలో పాకిస్థాన్ నుంచి నర్సుల వలసలు ఊహించలేనంత స్థాయిలో ఉన్నాయి. నిర్దేశిత ఈ కాల వ్యవధిలో ఏకంగా 2,144 శాతం మేర నర్సుల వలసలు పెరిగినట్టు ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ కథనం పేర్కొంది. ఈ ఏడాది కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతున్నట్టు వివరించింది.

