City Police Annual Press Meet: 2025 ఏడాదిలో హైదరాబాద్ కు సంబంధించిన నేరాల వార్షిక నివేదికను నగర కమిషనర్ వీసీ సజ్జనార్ (V.C. Sajjanar) విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 15 శాతం మేర క్రైమ్ రేట్ తగ్గినట్లు ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో సీపీ సజ్జనార్ అన్యువల్ ప్రెస్ మీట్ – 2025 నిర్వహించారు. విజిబుల్ పోలిసింగ్ చేయడంతో నేరాల సంఖ్య తగ్గిందన్న సజ్జనార్.. మహిళల పట్ల క్రైమ్ రేట్ మాత్రం గతంతో పోలిస్తే 6 శాతం మేర పెరిగినట్లు పేర్కొన్నారు.
ఈ ఏడాది నేరాల జాబితా
హైదరాబాద్ లో 2024లో 35944 ఎఫ్ఐఆర్ లు నమోదు కాగా.. ఈ ఏడాది 30,690 నమోదైనట్లు నగర కమిషనర్ సజ్జనార్ తెలిపారు. 176 హత్యాయత్నం కేసులు, 166 కిడ్నాప్ కేసులు, 4536 చీటింగ్ కేసులు, 405 అత్యాచారం కేసులు, 119 కిడ్నాప్ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ ఏడాది నగర పరిధిలో 69 హత్యలు చోటుచేసుకున్నట్లు చెప్పారు. అలాగే 49732 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 2679 ఆక్సిడెంట్ కేసులు రిజిస్టర్ అయినట్లు చెప్పారు. గతంతో పోలిస్తే మహిళలపై 6 శాతం, చైల్డ్ అండ్ పోక్సో కేసులు 27 శాతం పెరిగాయని సజ్జనార్ స్పష్టం చేశారు. అలాగే ఈ ఏడాది 526 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.
డ్రగ్స్ కేసులో 2690 మంది అరెస్ట్
డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం హైదరాబాద్ సిటీ పోలీసులు పాటుపడుతున్నట్లు సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. గతం ఏడాది 322 డ్రగ్స్ కేసులు నమోదుకాగా.. ఏడాది ఆ సంఖ్య 368కి చేరిందని చెప్పారు. మెుత్తం రూ.6.45 కోట్లు విలువైన డ్రగ్స్ ను ఈ ఏడాది సీజ్ చేశామని చెప్పారు. 2690 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ ను పెంచి.. డ్రగ్స్ పై మరింత ఉక్కుపాదం మోపుతామని సీపీ అన్నారు. అలాగే ఇన్వెస్ట్ మెంట్ మోసాలు 740 కేసులు , మ్యాట్రిమోని మోసాలు 12 కేసులు , వాట్సాప్ డీపీ మోసాలు 8 కేసులు , జాబ్ పేరుతో మోసం 43, ఓటీపీ మోసాలు 458 కేసులు నమోదైనట్లు సీపీ వివరించారు.
Also Read: Jagga Reddy on Pawan Kalyan: సినిమాలోనే కాదు.. బయటా యాక్టింగే.. పవన్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్
నగరవాసులకు సజ్జనార్ వార్నింగ్
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగరవాసులకు సీపీ సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని సూచించారు. ఫ్యామిలీతో ఉంటారా? జైల్లో ఉంటారా? అనేది మీరే నిర్ణయించుకోవాలని హెచ్చరించారు. ప్రజల భద్రత స్వేచ్చ కోసం హైదరాబాద్ సిటీ పోలీసు ఎప్పుడు ముందుంటారని సజ్జనార్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకొని నేరాలను తగ్గించే విధంగా పనిచేస్తామని సజ్జనార్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది కోసం ఒక లక్ష్యం పెట్టుకొని ఏఐ డ్రివెన్ పోలిసింగ్ తో ముందుకు వెళ్తామని వివరించారు.
Hyderabad City Police Annual Press Meet – 2025 (Live)https://t.co/XiqzIsmrAB
— Hyderabad City Police (@hydcitypolice) December 27, 2025

