Hydra: ఐటీ కేంద్రానికి సమీపంలో అత్యంత ఖరీదైన నెక్నామ్ పూర్ ప్రాంతంలో 23.16 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా సోమవారం కాపాడింది. ఈ భూమి విలువ రూ. 2500 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంఛనాలేస్తున్నారు. ఈ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసిన హైడ్రా బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. ఈ ఆక్రమణల వెనుక కొందరు బడాబాబుల కుట్రలను హైడ్రా భగ్నం చేసింది. సామాన్యులను ముందు పెట్టి భూమిని సొంతం చేసుకుని రూ. కోట్లకు పడగలెత్తేందుకు బడాబాబులు చేసిన ప్రయత్నాలకు హైడ్రా అనూహ్యంగా చెక్ పెట్టింది.
23.16 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం, నెక్నామ్ పూర్ విలేజ్ సర్వే నెంబరు 20లో ఉన్న 23.16 ఎకరాల భూమి ఆక్రమణలకు గురవుతోందని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో హైడ్రా లోతైన విచారణ చేపట్టింది. ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకున్న తర్వాత ఆక్రమణలను హైడ్రా తొలగించింది. కొన్ని కట్టడాలను ఇప్పటికే నేలమట్టం చేయగా, సోమవారం మరి కొన్ని ప్రహరీలతో పాటు షెడ్లను తొలగించి వెను వెంటనే 23.16 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. అలాగే ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను కూడా ఏర్పాటు చేసింది.
Also Read: Hydra: ప్రజావాణికి 46 ఫిర్యాదులు.. కబ్జాలపైనే ఎక్కువగా ఆర్జీలు!
బడాబాబులకు చెక్
ప్రభుత్వ భూమి ఎక్కడ ఉన్నా, పాగా వేసి సామాన్యులను ముందుంచి కబ్జాల పర్వాన్ని నడిపించిన బడాబాబుల ఆగడాలకు హైడ్రా చెక్ పెట్టింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం పూర్తిగా ప్రభుత్వ భూమి అయినప్పటికీ, పాకాల పోచయ్య దగ్గర భూమిని కొన్నట్టు మహ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి తప్పుడు రికార్డులను సృష్టించారు. ఇలా కొనుగోలు చేశామని, భూమికి సంబంధించి పాసు బుక్కులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు నుంచి వచ్చిన ఆదేశాలతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ భూమిగా నిర్ధారించి ఇదే విషయాన్ని కోర్టుకు తెలియజేశారు. ఎలానూ తన వద్ద కొన్నట్టు మహ్మద్ ఇబ్రహీం నకిలీ రికార్డు సృష్టించడంతో పోచయ్య కుటుంబం కూడా హక్కులకోసం పోరాడడం గమనార్హం. ఈ తంతుపై మహ్మద్ ఇబ్రహీంపై రెవెన్యూ అధికారులు నార్సింగ్ పోలీసు స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు. 1975లో ఈ భూమిని పోచయ్య దగ్గర నుంచి కొన్నట్టు మహ్మద్ ఇబ్రహీం తప్పుడు పత్రాలు సృష్టిస్తే, 2019లో పాకాల పోచయ్య కుటుంబ సభ్యులు అదే భూమి తమదంటూ పోరాటం మొదలు పెట్టడం కొసమెరుపు.
ఊపిరి పీల్చుకున్న స్థానికులు
వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ భూమిని కబ్జా చేసేందుకు బడాబాబులు చేసిన ప్రయత్నాలకు హైడ్రా చెక్ పెట్టింది. సామాన్యలను ముందు పెట్టిన విషయాన్ని ముందుగానే హైడ్రా టెక్నికల్ గా గుర్తించటంతోనే ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. బడాబాబులు చేసే కబ్జా ప్రయత్నాలకు హైడ్రా భగ్నం చేసింది. అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రాకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. నగర ప్రణాళిక నిబంధనల ప్రకారం ప్రణాళికాబద్ధ అభివృద్ధితో పాటు ఓపెన్ స్పేస్, గ్రీన్ జోన్లుగా ఈ స్థలాలను అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు కృతజ్ఞతలు తెలిపారు. హైడ్రా వంటి పటిష్టమైన వ్యవస్థను తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.
ఇండస్ వ్యాలీలో పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం అమీన్‌పూర్ విలేజ్‌లోని సర్వే నెంబర్ 1019, 1020(పి)లో 2.27 ఎకరాల పరిధిలో లే ఔట్ వేశారు. 2005లో 24 ప్లాట్లతో అపెక్స్ ప్రాపర్టీస్ వారు ఈ లే ఔట్ వేశారు. ఇందులో సగం ల్యాండ్ ఓనర్‌ది కాగా, మిగతా భూమి అపెక్స్ డెవలపర్స్‌ది. ఇందులో భాగంగా లే ఔట్‌లో 672 గజాల మేర పార్కుకు కేటాయించారు. ఇలా కేటాయించిన పార్కు స్థలాన్ని2013లో ల్యాండ్ ఓనరల్ తన బంధువుకు గిఫ్ట్ డీడ్ చేశారు. ఇక్కడితో వివాదం మొదలైంది. దీనిపై ఇండస్ వ్యాలీ -2 నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో హైడ్రా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. పార్కు స్థలమే అని నిర్ధారణ కావడంతో ఆక్రమణలను తొలగించి, 672 గజాల పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. దశాబ్ద కాలంగా పార్కు స్థలం కోసం పోరాడుతున్నామని, హైడ్రా చర్యలతో ఇది సాధ్యమైందని ఇండస్ వ్యాలీ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ పార్కు స్థలాన్ని డబ్బుల్లో లెక్క కడితే రూ. 5 కోట్ల విలువ ఉంటుందని పేర్కొన్నారు.
Also Read: Hydraa: మియాపూర్‌లో హైడ్రా బిగ్ ఆపరేషన్.. రూ.600 కోట్ల భూమి సేఫ్

