Hydra: చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడుతున్న హైడ్రాతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని సోమవారం హైడ్రా ప్రజావాణికి విచ్చేసిన పలువురు నగరవాసులు అభిప్రాయపడ్డారు. చెరువులు, నాలాలను పరిరక్షించి అనుసంధానం చేయాలని, అప్పుడే వరదలు లేని నగరం చూడగలమన్నారు. ఈ క్రమంలో చెరువులను పరిరక్షిస్తున్న హైడ్రా పార్కుల అభివృద్ది కూడా చేపట్టాలని పలువురు కోరారు.
లేఅవుట్లలో ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను పార్కులుగా అభివృద్ధి చేసి ప్రాణవాయువును అందించాలని పలువురు డిమాండ్ చేశారు. నిజాంపేటలోని తుర్క చెరువు కింద ఉన్న ప్రభుత్వ స్థలాలకు కంచెవేసి పార్కులుగా తీర్చిదిద్దాలని కోరారు. అలాగే, మేడ్చల్ జిల్లా కాప్రా మండలం చిన్న చెర్లపల్లిలోని వెంకట రెడ్డి కాలనీలో పార్కు స్థలం కబ్జాకు గురి అవుతోందని, వెంటనే హైడ్రా జోక్యం చేసుకోవాలని కోరారు. సోమవారం హైడ్రా ప్రజావాణికి మొత్తం 46 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించి, పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు.
Also Read: Hydraa: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో హైడ్రా పై ప్రశంల వర్షం
డంపింగ్ యార్డుగా సర్కార్ భూమి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలంలోని కండ్లకోయ విలేజ్‌లో కోర్టు భవనం, ట్రాఫిక్ పోలీసు స్టేషన్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మాణానికి ఉద్దేశించిన ప్రభుత్వ భూమి ఇప్పుడు డంపింగ్ యార్డుగా మారిపోయిందని, గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ వారు అక్కడ చెత్త వేసి తగులబెడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో భూగర్భజలాలు కలుషితమవ్వటంతో పాటు దుర్గంధం, పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని, ప్రభుత్వ కార్యాలయాలకు ఉద్దేశించిన స్థలాన్ని కాపాడాలని కోరారు. రామంతాపూర్ పెద్ద చెరువులో తమ ప్లాట్లు మునిగిపోయాయని, తమకు ప్రత్యామ్నయంగా భూమి లేదా తగిన విధంగా నష్ట పరిహారం ఇప్పించాలని అక్కడి నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 1958లో గ్రామపంచాయతీ లేఅవుట్‌లో ప్లాట్లు కొనుగోలు చేశామని, చెరువుకు బండ్ నిర్మించినప్పుడు కూడా కొందరికి నష్టపరిహారం ఇస్తామన్నా ఇప్పటికీ ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పార్కింగ్ స్థలంలో దుకాణాలు
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం కురుములగూడ జన్నారం కాలనీలో రాజీవ్ గృహకల్ప పేరుతో 16 బ్లాకులు నిర్మించారు. ఇక్కడ కిందన ఉన్న వారు అపార్టుమెంట్ల ముందు, వెనుక పార్కింగ్ కోసం ఉద్దేశించిన స్థలాలను కలిపేసుకుని కొన్ని చోట్ల దుకాణాలు నిర్మించుకోగా, మరి కొంతమంది అదనంగా గదులు నిర్మించుకుని కిరాయిలకు ఇచ్చుకుంటున్నారని, దీంతో తమకు పార్కింగ్ సౌకర్యం లేకుండా పోయి రాకపోకలకు ఇబ్బందిగా మారిందని వాపోయారు.
వెంటనే ఆ స్థలాలను ఖాళీ చేయించాలని కోరారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేట విలేజ్‌లో తుర్క చెరువుతో పాటు చెరువు కట్ట కబ్జాలకు గురవుతుందని, చెరువు కింద ఉన్న ప్రభుత్వ భూమిని బడా నిర్మాణ సంస్థలు కలిపేసుకుని ప్రహరీలు నిర్మిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. అలాగే, అమీన్‌పూర్ పెద్ద చెరువు నుంచి బందం కొమ్ము చెరువుకు వెళ్లే వరద కాలువ కబ్జాలకు గురవుతుందని స్థానికులు ప్రజావాణిలో తెలిపారు. రియల్ ఎస్టేట్ సంస్థలు నాలాను ఆక్రమించి పనులు చేపడుతున్నారని, దీంతో తమ ప్రాంతాల్లో వరద నీరు నిలుస్తోందని వాపోయారు.
Also Read: HYDRAA: నల్లచెరువులో ఆక్రమణలను తొలగించలేదు: హైడ్రా

