Hydraa: ఇప్పటి వరకు రూ.వేల కోట్ల విలువైన సర్కారు భూములను కాపాడిన హైడ్రా సోమవారం మియాపూర్‌లో మరో బిగ్ ఆపరేషన్ నిర్వహించింది. సుమారు రూ.600 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని కాపాడి, మున్ముందు ఆక్రమణలు రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.
5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా ప్లాన్
రంగారెడ్డి(Rangareddy) జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్(Miyapur) విలేజ్ మక్తా మహబూబ్‌పేటలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని కొందరు ప్లాన్ చేశారు. ఈ ప్రయత్నాలను హైడ్రా అడ్డుకున్నది. మియాపూర్, బాచుపల్లి ప్రధాన రహదారికి సమాంతరంగా ఉన్న చెరువు కట్టపై 200 మీటర్ల మేర వేసిన 18 షెట్టర్లను తొలగించింది. దుకాణాల వెనుక వైపు ప్రైవేట్ బస్సుల పార్కింగ్ ఉంచిన స్థలాన్ని కూడా ఖాళీ చేయించింది. మియాపూర్ సర్వే నెంబర్ 39లో మక్తా మహబూబ్‌పేట చెరువు కట్ట కబ్జాతో పాటు గతంలో మైనింగ్‌కు ఇచ్చిన సర్వే నెంబర్ 44/5 లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురతున్నట్టు స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదు అందింది. ఒక్కో షెట్టర్(దుకాణం) నుంచి నెలకు రూ.50 వేల చొప్పున ప్రతి నెల రూ.9 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అక్కడ ప్రైవేట్ బస్సుల పార్కింగ్‌కు స్థలాన్ని ఇచ్చి నెలకు రూ.8 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. దీంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు పరిశీలించి, ఆక్రమణలు జరిగినట్లు నిర్థారించుకున్న తర్వాత యాక్షన్‌లోకి దిగారు.
Also Read: Bigg Boss Telugu 9: సంజన జైలుకి, తాత్కాలిక కెప్టెన్‌గా భరణి.. నామినేషన్స్ టాస్క్‌లో విన్నర్ ఎవరు?
బడాబాబుల మద్దతుతో..
సర్వే నెంబర్ 44/5కు బదులు 44/4 నెంబరును సృష్టించి 5 ఎకరాల భూమిని కబ్జా చేసినట్టు తమ విచారణలో తేలినట్లు హైడ్రా వెల్లడించింది. కారు వాషింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకుని మొత్తం ఈ భూమిని కబ్జా చేసినట్టు వెల్లడైంది. మైనింగ్‌కు ఇచ్చిన భూమి గడువు పెంచాలని దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నిరాకరించింది. మైనింగ్‌కు ఇచ్చిన భూమిలోనే తప్పుడు సర్వే నెంబర్ (44/4)తో కబ్జాకు పాల్పడినట్టు వెల్లడైంది. శేరిలింగంపల్లి తహసీల్దార్ 2013లో నోటీస్ ఇచ్చి షెట్టర్లను తొలగించినట్టు కూడా తేలింది. కబ్జాలకు పాల్పడిన కూన సత్యం గౌడ్, బండారి అశోక్ ముదిరాజ్‌ల వెనుక బడాబాబులు ఉన్నట్టు సమాచారం. వారు వెనుక ఉండి వీరితో కబ్జాల పర్వాన్ని నడుపుతున్నారని తెలిసిందని హైడ్రా వెల్లడించింది. ప్రస్తుతం ఈ భూమి తమదని చెబుతున్న వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పాటు తాము వేరే వాళ్లతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని చెబుతున్నారు. ఆ వేరే వాళ్లు ఎవరనేది ఇంకా తేలాల్సి ఉన్నది. ఈ లోగా ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ఈ భూమికి ఆనుకుని ఉన్న ఐదు ఎకరాల చెరువు కబ్జా ప్రయత్నాలకు కూడా చర్యలతో చెక్ పెట్టినట్టయింది.
Also Read: GHMC: బల్దియా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

