Student Suicide: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయగఢ్ జిల్లాలోని ఓ విశ్వవిద్యాలయంల బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. విద్యా ఒత్తిడి, ఆర్థిక సమస్యలే ఈ విషాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
జార్ఖండ్ రాష్ట్రం జంషెడ్‌పూర్‌కు చెందిన 20 ఏళ్ల ప్రిన్సీ కుమారి, బీటెక్ కంప్యూటర్ సైన్స్ రెండో సంవత్సరం చదువుతోంది. శనివారం అర్ధరాత్రి ఆమె హాస్టల్ గదిలో ఉరి వేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. సాయంత్రం 8.30 గంటల నుంచి కుమార్తె ఫోన్ ఎత్తకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు యూనివర్సిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో, హాస్టల్ వార్డెన్ ఆమె గదికి వెళ్లి చూడగా, లోపల నుంచి తాళం వేసి ఉండటాన్ని గమనించారు. పలుమార్లు తలుపు తట్టినా పలకకపోవడంతో కిటికీ లోపల నుంచి చూసిన వార్డెన్, ప్రిన్సీ ఉరివేసుకుని ఉన్నట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు.
ఈ కేసులో కీలకంగా మారింది ఆమె గదిలో లభించిన సూసైడ్ నోట్. అందులో ప్రిన్సీ తన తల్లిదండ్రులను ఉద్దేశించి, “సారీ మమ్మీ, పాపా… మీ అంచనాలను నెరవేర్చలేకపోయాను” అంటూ క్షమాపణ చెప్పింది. చదువు కోసం తల్లిదండ్రుల కష్టార్జితాన్ని వినియోగిస్తున్నానన్న బాధ, అపరాధభావం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, ప్రిన్సీ ప్రస్తుతం రెండో సంవత్సరం పరీక్షలకు సిద్ధమవుతుండగా, మొదటి సెమిస్టర్‌కు సంబంధించిన ఐదు బ్యాక్‌లాగ్ సబ్జెక్టులను కూడా ఒకేసారి క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ చదువు భారం ఆమెపై తీవ్ర ఒత్తిడిని తెచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు కూడా ఆమెను కలవరపెట్టినట్లు తెలుస్తోంది. సెమిస్టర్ ఫీజుల కోసం సుమారు రూ. లక్షను విడతలుగా చెల్లించాల్సి ఉండగా, ఇటీవల కుటుంబ సభ్యుల వద్ద ఆ మొత్తాన్ని అడిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆర్థిక భారం కూడా ఆమె నిర్ణయంపై ప్రభావం చూపినట్టు భావిస్తున్నారు.
Also Read: Adwait Kumar Singh: వరదలు, పరిశ్రమ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్!
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, యూనివర్సిటీ సిబ్బంది, హాస్టల్ విద్యార్థులను విచారిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ప్రిన్సీ కుటుంబానికి అప్పగించారు. ఈ విషాద ఘటన విద్యార్థులపై పెరుగుతున్న చదువు ఒత్తిడి, మానసిక ఆరోగ్యంపై మరోసారి చర్చకు దారితీస్తోంది.
Also Read: Sreenivasan Death: ప్రముఖ మలయాళ నటుడు శ్రీనివాసన్ కన్నుమూత.. మోహన్ లాల్‌తో అద్భుత ప్రయాణం..

