Pawan Sacrifice: తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కేవలం ఒక స్టార్ హీరో మాత్రమే కాదు, అంతకు మించి విలువలు ఉన్న వ్యక్తి అని ఆయన అభిమానులు నమ్ముతుంటారు. దీనిని నిజం చేస్తూ, ఆయన ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’ నిర్మాణం విషయంలో పవన్ చూపిన ఉదారత ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక సినిమా కోసం హీరో తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవడం చూశాం, కానీ సొంత ఆస్తులను తాకట్టు పెట్టి మరీ నిర్మాతను గట్టెక్కించడం అనేది అరుదైన విషయం. ప్రస్తుతం సినిమా ఆడకపోతే నిర్మాతల వైపు కనీసం చూడని హీరోలకు పవన్ కళ్యాణ్ ఆదర్శంగా నిలుస్తారు.
Read also-James Ransone: హాలీవుడ్‌కు తీరని లోటు.. జేమ్స్ రాన్సోన్ 46 ఏళ్ల వయసులో కన్నుమూత
రెమ్యూనరేషన్ విషయంలో రాజీ లేని త్యాగం..
సాధారణంగా పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమా అంటే మార్కెట్ విలువ వందల కోట్లలో ఉంటుంది. ‘హరిహర వీరమల్లు’ ప్రారంభంలో ఆయన రెమ్యూనరేషన్ రూ.50 కోట్లుగా నిర్ణయించారు. అయితే, సినిమా నిర్మాణం సుదీర్ఘకాలం సాగడం, బడ్జెట్ పెరగడం వంటి కారణాల వల్ల నిర్మాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్న పవన్, తన పారితోషికాన్ని ఏకంగా రూ.11 కోట్లకు తగ్గించుకున్నారు. ఇది ఒక హీరో చేసిన అతిపెద్ద త్యాగంగా చెప్పవచ్చు. అయితే ఆయన ఉదారత అక్కడితో ఆగలేదు. సినిమా విడుదలకు ముందు మరిన్ని ఆర్థిక చిక్కులు ఎదురైనప్పుడు, తాను తీసుకోవాల్సిన ఆ రూ.11 కోట్లను కూడా పూర్తిగా వదులుకుంటున్నట్లు ప్రకటించి నిర్మాతకు ఊపిరి పోశారు.
సొంత ఇంటిని తాకట్టు పెట్టి మరీ..
ఈ సినిమాకు సంబంధించిన ఫైనాన్సియర్లకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (PMF) గ్యారెంటీగా నిలిచింది. కానీ ఆర్థిక లావాదేవీల వల్ల ఆ సంస్థ ఇబ్బందుల్లో పడకూడదని భావించిన పవన్ కళ్యాణ్, బాధ్యతను తన భుజానికెత్తుకున్నారు. తన వ్యక్తిగత ఆస్తి అయిన పిఠాపురంలోని నివాసాన్ని తాకట్టు పెట్టి, ఆ మొత్తాన్ని ఫైనాన్సియర్లకు చెల్లించారు. ఒక సినిమా కోసం తన ఇంటిని పణంగా పెట్టడం ఆయనకు సినిమా పట్ల ఉన్న నిబద్ధతను చాటిచెబుతోంది. దీంతో పవన్ ఉదారత మరొక్క సారి ప్రేక్షకులకు తెలుస్తోంది.
Read also-Tanuja Puttaswamy: భావోద్వేగానికి లోనైన బిగ్ బాస్ రన్నర్ తనూజ .. ప్రేక్షకుల గురించి ఏం అన్నారంటే?
నష్టపోయిన వారికి అండగా..
కేవలం నిర్మాతలే కాదు, సినిమా నమ్ముకున్న బయ్యర్లు కూడా నష్టపోకూడదనేది పవన్ నైజం. ఈ క్రమంలోనే భారీగా నష్టపోయిన ఒక బయ్యర్‌కు తన వంతు సహాయంగా రూ.1.5 కోట్లు అందజేశారు. ఒక ప్రాజెక్ట్ వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా చూస్తే, ‘హరిహర వీరమల్లు’ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ ఆర్థికంగా లాభపడకపోగా, భారీ మొత్తంలో నష్టపోయారు. అయినప్పటికీ, సినిమాను పూర్తి చేసి ప్రేక్షకులకు అందించాలనే పట్టుదలతో ఆయన ముందుకు సాగుతున్నారు. తనను నమ్మిన వారి కోసం ఆస్తులను కూడా లెక్కచేయని ఆయన వ్యక్తిత్వం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.

