Toshakhana 2 Case: పాకిస్థాన్ (Pakistana) మాజీ ప్రధానమంత్రి, పీటీఐ (PTI) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌కు (Imran Khan) ఊహించని పరిస్థితి ఎదురైంది. తోషాఖానా-2 అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు, అతడి భార్య బుష్రా బీబీకి చెరో 17 ఏళ్ల జైలుశిక్ష పడింది. ఈ మేరకు స్పెషల్ కోర్టు శనివారం నాడు తీర్పు వెలువరించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న రావల్పిండిలోని అడియాలా జైలులోనే విచారణ జరిగింది. శనివారం నాడు ప్రత్యేక కోర్టు జడ్జి షారూఖ్ అర్జుమంద్ ఈ తీర్పును ఇచ్చారు. నేరపూరిత నమ్మకద్రోహానికి పాల్పడినట్టు రుజువైందని, దీంతో, పాకిస్థాన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 409 కింద ఇమ్రాన్ ఖాన్, అతడి బుష్రా బీబీలకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించినట్టు పేర్కొన్నారు. అలాగే, అవినీతి నిరోధక చట్టంలోని వివిధ నిబంధనల ప్రకారం మరో ఏడేళ్ల శిక్షను కూడా విధిస్తున్నట్టు వివరించారు. జైలు శిక్ష మాత్రమే కాకుండా, భార్యభర్తలకు చెరో రూ. 1.64 కోట్ల జరిమానా కూడా విధిస్తున్నట్టు జడ్జి తెలిపారు. కాగా, స్పెషల్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పుని ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీల తరపు హైకోర్టులో సవాల్ చేస్తామని వారి తరపు న్యాయవాదులు మీడియాతో చెప్పారు.
Read Also- Maoists Surrender: అజ్ఞాతంలో ఉన్నవారు జన జీవనంలోకి రండి.. మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి సూచన
అసలేంటీ కేసు?
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత, తోషాఖానా-2 (Toshakhana-2) అవినీతి కేసు నమోదయింది. 2021లో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు సౌదీ అరేబియా ప్రభుత్వం నుంచి పాక్ ప్రభుత్వానికి ‘బల్గేరి’ జ్యువెలరీ సెట్, మరికొన్ని ఇతర ఖరీరైన బహుమతులు అందాయి. నిబంధనల ప్రకారం విదేశీ ప్రభుత్వాల నుంచి అందే అలాంటి కానుకలు ప్రభుత్వ ఖజనాకు (తోషాఖానా) చెందుతాయి. ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. అయితే, ఒకవేళ వాటిని దక్కించుకోవాలనుకుంటే, వాటి విలువలో నిర్ణీత శాతాన్ని చెల్లించి దక్కించుకోవచ్చు. ఈ నిబంధనను ఆసరాగా చేసుకొని, ఇమ్రాన్ ఖాన్ దంపతులు ఆ జ్యువెలరీ సెట్ విలువను చాలా తక్కువగా అంచనా వేయించి, నామమాత్రపు ధరకే దక్కించుకున్నారనేది ప్రధాన ఆరోపణగా ఉంది. నగల సెట్‌ను దక్కించుకునేందుకు నిబంధనలను ఉల్లంఘించారంటూ కేసు నమోదయింది. ఈ కేసుపై పాకిస్థాన్ దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఏ దర్యాప్తు జరిగింది. దాదాపుగా 8 కోట్ల రూపాయల విలువైన వస్తువులను చాలా తక్కువ మొత్తానికి తీసుకున్నట్టుగా విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ లభించడంతో స్పెషల్ కోర్టు ఈ తీర్పునిచ్చింది.

