Vrushabha Trailer: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన పాన్-ఇండియా చిత్రం ‘వృషభ’. తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. యాక్షన్, ఎమోషన్, పీరియడ్ డ్రామా కలయికగా ఈ సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. దీంతో మోహన్ లాల్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టకున్నారు. ట్రైలర్ రాజుల కాలంనాటి కాలాన్ని ప్రస్తుత ప్రపంచాన్ని కలిపే విధంగా కథ ఉన్నట్లు తెలుస్తోంది.
Read also-Bigg Boss9 Telugu: బిగ్ బాస్ 9 హౌస్‌లోకి ‘మిస్సమ్మ’ జోడీ.. శివాజీ, లయల సందడి మామూలుగా లేదుగా..
ట్రైలర్ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉత్కంఠను రేకెత్తించే అంశాలు ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా పునర్జన్మ (Pre-incarnation) అనే కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. హీరో కలల్లో తరచూ హింస, రక్తపాతం, భీకర యుద్ధాలు కనిపిస్తుంటాయి. మనిషి మెదడు అంగీకరించలేని విషయాలను కూడా వాస్తవం ఎలా శాసిస్తుంది అనే పాయింట్ ఆసక్తికరంగా ఉంది. ‘విజయేంద్ర వృషభ’గా మోహన్ లాల్ తన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. ఆయన కళ్ళలో కనిపించే తీక్షణత, యుద్ధ రంగంలో ఆయన చూపే పరాక్రమం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. గుర్రాలు, ఏనుగులు, రథాలు భారీ సామ్రాజ్యాల మధ్య జరిగే పోరాటాలు హాలీవుడ్ స్థాయి విజువల్స్‌ను తలపిస్తున్నాయి. యాక్షన్ ప్రియులకు ఇది ఒక విందులా ఉండబోతోంది. “తను మాట్లాడిన ప్రతి మాటకి నా ఖడ్గమే సమాధానం చెబుతుంది”, “వృషభ మహారాజుకు ఎదురు వెళ్ళడం అంటే మాట్లాడినంత సులభం కాదు” వంటి డైలాగులు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
Read also-Dandora Movie Trailer: శివాజీ ‘దండోరా’ ట్రైలర్ వచ్చేసింది.. ఆ మత్తు దిగాలంటే టైమ్ పట్టుద్ది సార్..
సామ్ సి.ఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి ఫ్రేమ్‌ను ఎలివేట్ చేసింది. నంద కిషోర్ దర్శకత్వ ప్రతిభ విజువల్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. సినిమాలో తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ కూడా ఒక కీలక మలుపుగా అనిపిస్తోంది. “నన్ను దాటి మా నాన్నని నువ్వు ఏమి చేయలేవు” అనే డైలాగ్ ద్వారా సినిమాలో బలమైన సెంటిమెంట్ కూడా ఉందని అర్థమవుతోంది. భారీ అంచనాల మధ్య రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. క్రిస్మస్ కానుకగా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.

