Bhatti Vikramarka: భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రాష్ట్రంలో నిరంతరంగా నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Bhatti Vikramarka Mallu) అన్నారు. శుక్రవారం ఆయన జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో నిర్వహించిన ప్రజావాణి రెండవ వార్షికోత్సవ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రజావాణి దరఖాస్తుల్లో అత్యధిక ఆర్జీలను పరిష్కరించినందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి(Collector Harichandana Dasari)కి అవార్డును కూడా అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వం, పాలన ప్రజల కోసమే అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో పాటు యావత్ క్యాబినెట్ సహచరులు అంతా కలిసి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయమే ప్రజావాణి అని వ్యాఖ్యానించారు.
74 శాతం విజయం సాధ్యం
ప్రజల సమస్యలు విని పరిష్కారం చేయడానికి ప్రతి మంగళ, శుక్రవారాలు రెండు రోజులపాటు క్రమం తప్పకుండా దరఖాస్తులు తీసుకొని 74 శాతం సమస్యలు పరిష్కారించడం గొప్ప విజయమేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజావాణి నిర్వహించటమే కాదు, వచ్చిన దరఖాస్తులను నిబద్దతతో దృష్టి సారించి ఉద్యోగ బృందం ప్రయత్నం చేయకపోతే 74 శాతం విజయం సాధ్యం కాదని తెలిపారు. ఇంకా పరిష్కారం కాని పైప్ లైన్ లు వంటి అంశాలను పరిష్కరించే అవకాశముందని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. ఏ సంకల్పంతో ప్రజావాణిని ప్రారంభించామో ఆ లక్ష్యం నెరవేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా కొనసాగిస్తామని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర జిల్లా స్థాయిలో ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు.
వ్యవస్థలు ప్రజల కోసం
10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించిన వారు ప్రజల కోసం కనీసం ప్రజాభవన్ గేట్లు తెరవని వారు కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని మాట్లాడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణిలో విజయ గాధలు వింటుంటే సిబ్బంది ఎంత చిత్తశుద్ధితో పనిచేశారో? వివరించి అభినందించేందుకే తాను ఈ సమావేశానికి వచ్చానని డిప్యూటీ సీఎం తెలిపారు. మా ఆలోచన, పాలన, వ్యవహారం అంతా ప్రజలకే అంకితమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సంస్థలు వ్యవస్థలు ప్రజల కోసం ఉపయోగపడాలనేదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏమాత్రం భయం లేకుండా ప్రజలు వారి సమస్యలు చెప్పుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ భవనాన్ని ఆశీర్వదించాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుకు సాగాలని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి. ముకుంద రెడ్డి, కదిరివన్ పలని, జిల్లా రెవెన్యూ అధికారి ఈ వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.

