Hydraa: హైదరాబాద్ లోని కబ్జాదారులపై మరోమారు హైడ్రా ఉక్కుపాదం మోపింది. పాతబస్తీ, నిజాం పేట ప్రాంతాల్లో ఏకంగా రూ.1700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడింది. ముందుగా పాతబస్తిలో కబ్జాకు గురైన 7 ఎకరాల భూమిని రక్షించినట్లు హైడ్రా ప్రకటించింది. ఇనుప రేకులతో ప్రహారి నిర్మించి ఆక్రమణలో ఉన్న వారిని రెవెన్యూ అధికారుల సమక్షంలో ఖాళీ చేయించినట్లు పేర్కొంది. అంతేకాదు దానిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు సైతం అక్కడ ఏర్పాటు చేసింది. దీంతో అక్కడి స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ భూమి విలువ రూ.400 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ బండ్లగూడలోని కందికల్ విలేజ్‌లో గల మొహమ్మద్‌నగర్ – లాలితాబాగ్ ప్రాంతంలో ఈ కబ్జా చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ సమీపంలో మొత్తం 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో 2 ఎకరాలు కబ్జాకు గురై నివాసాలు కూడా వచ్చేశాయి. అయితే వాటి జోలికి పోకుండా మిగతా 7 ఎకరాల భూమిని శుక్రవారం హైడ్రా కాపాడింది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ప్రకారం అక్కడ చెరువు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. కానీ ఆ చెరువు ఆనవాళ్లు ఎక్కడా లేకుండా మట్టితో కబ్జాదారులు కప్పేసినట్లు హైడ్రా గుర్తించింది.
స్థానికుల హర్షం..
కబ్జా దారుల చెర నుంచి విముక్తి కల్పించిన హైడ్రాకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. హైడ్రాకు ఫిర్యాదు చేయగానే.. స్థానికంగా విచారించి.. వెంటనే చర్యలు తీసుకోవడాన్ని కుమ్మరి వాడి పీస్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. రెండు కమ్యూనిటీల మధ్య ఉన్న సున్నితమైన ప్రాంతంలో కబ్జాలకు పాల్పడిన వారు ప్లాట్లుగా మార్చి అమ్మేందుకు ప్రయత్నించడం వివాదంగా మారింది. వీరి వెనుక బడాబాబుబులున్నారంటూ ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. ఈ అక్రమ ఆక్రమణలపై గతంలోనే బండ్లగూడ తహసీల్దార్, పోలీసు శాఖలకు పలుమార్లు ఫిర్యాదు చేయడం.. కోర్టులు కూడా ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తీర్పులు ఇచ్చినప్పటికీ కబ్జాదారులు ఖాళీ చేయకుండా ప్లాట్లు చేసి అమ్ముకోవాలని ప్రయత్నించడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.
Also Read: IND vs SA 5th T20I: కొద్ది గంటల్లో ఐదో టీ20.. టీమిండియాలో భారీ మార్పులు.. ఈ ఇద్దరు స్టార్లు ఔట్!
నిజాంపేటలో 13 ఎకరాలు సేఫ్..
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా, బాచుపల్లి మండలం, నిజాంపేట విలేజ్‌లో 13 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా శుక్రవారం కాపాడింది. ఈ భూమి విలువ దాదాపు రూ. 1300 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. సర్వే నంబరు 186, 191తో పాటు 334లలో ప్రభుత్వ భూమి కబ్జా అవుతోందని.. కాపాడాలని బాచుపల్లి మండల రెవెన్యూ అధికారులు హైడ్రాను కోరారు. కబ్జాలతో ఇప్పటికే కొంత భూమి ఆక్రమణలకు గురి అయ్యిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కాపాడాలంటూ హైడ్రాను కోరారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే నంబరు 334లో ఇప్పటికే 4 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాలు జరిగి శాశ్వత నివాసాలు కూడా వచ్చినట్టు నిర్ధారించుకుంది. నివాసాల జోలికి వెళ్లకుండా.. అక్కడ మిగిలి ఉన్న 13 ఎకరాల ప్రభుత్వ భూమిలో వెలిసిన తాత్కాలిక షెడ్డులను హైడ్రా తొలగించింది. భూమి చుట్టూ ఫెన్సింగ్ సైతం ఏర్పాటు చేసింది.

