Panchayat Elections: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. మూడు విడుతల్లో పంచాయతీ ఎన్నికలను ఎన్నికల సంఘం నిర్వహించింది. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. గతంలో లేని విధంగా రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. మొత్తం 1.35 కోట్లు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా సగటున 85.30 శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కొంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలపై రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఎన్నికలను ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, రీపోలింగ్ అవసరం లేకుండా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయినట్లు ప్రకటించింది.
అధికార యంత్రాంగానికి ఎన్నికల సంఘం కృతజ్ఞతలు
ఎన్నికల నిర్వహణలో సహకరించిన ప్రభుత్వం, సీఎం, డీజీపీ, జిల్లాల యంత్రాంగానికి ఎన్నికల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలు, లిక్కర్ మానిటరింగ్‌తో ఎన్నికలను ప్రశాంతంగా ముగించినట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కొత్తగా 11,497 సర్పంచు స్థానాలు గెలుచుకోగా.. 1,205 ఏకగ్రీవం అయ్యాయి. 85,955 వార్డులు గెలుచుకోగా.. 25,848 వార్డులు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.
ఎలక్షన్ కోడ్ ఎత్తివేత
రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లోనూ.. రీ-పోలింగ్స్, వాయిదాలు లేవు. జీరో కౌంటర్ మ్యాండ్స్ నమోదయ్యాయని, ఎన్నికల సంఘం సెక్రెటరీ మకరందు ప్రకటించారు. ఎన్నికల్లో ఎస్ఈసీ కఠిన నిబంధనలు అమలు చేయడం, పకడ్బందీ ఏర్పాట్లు, భద్రతా చర్యలతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా రీ-పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదన్నారు. వాయిదాలు, రద్దు వంటి సంఘటనలు సున్నాగా నమోదయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో గురువారం సాయంత్రం 5 గంటల నుంచి ఎలక్షన్ కోడ్ (ఎంసీసీ) ఎత్తివేసినట్టు చెప్పారు.
యాదాద్రి జిల్లాలో అత్యధిక శాతం
యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధిక శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటించారు. జిల్లాలో అత్యధికంగా 92.33 శాతం ఓటింగ్ నమోదైంది. ఖమ్మం 90.08%తో రెండో స్థానం, సూర్యాపేట 89.68% మూడో స్థానం, నల్గొండ 89.57% నాల్గో స్థానం, మెదక్ 89.37% ఐదో స్థానంలో ఉంది. ఓటింగ్ శాతంలో యాదాద్రి టాప్ లో ఉన్నా.. పోలైన మొత్తం ఓట్ల సంఖ్యలో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని, ఈ జిల్లాలో 9,02,000 పైచిలుకు ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా, ఎన్నికల విధుల్లో ఉంటూ మరణించిన ములుగు జిల్లా వెంకటాపూరం ఎంపీడీవో కె.రాజేంద్రప్రసాద్, ఆసిఫాబాద్ మిషన్ భగీరథ ఏఈ కట్రావత్ మృతి పట్ల ఎన్నికల సంఘం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించేలా ప్రతిపాదనలు పంపాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఎన్నికల సంఘం ఆదేశించింది.
Also Read: Panchayat Elections: నేడు మూడో విడత పోలింగ్.. అన్ని ఏర్పాటు పూర్తి చేసిన అధికారులు!

