Viral Video: వివాహాల సమయంలో ఫొటో గ్రాఫర్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. పర్ఫెక్ట్ షాట్ ను చిత్రీకరించేందుకు వారు ఎంతగానో శ్రమిస్తుంటారు. నూతన వధూవరులకు మరుపురాని అనుభూతిని అందించేందుకు తెగ తాపత్రాయపడుతుంటారు. ఈ క్రమంలోనే కొన్ని ఇబ్బందికర పరిస్థితులను సైతం వారు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వీడియోలో ఏముందంటే?
పెళ్లి కూతురిని ఫొటో తీసేందుకు పరిగెత్తుకు వచ్చిన ఓ ఫొటోగ్రాఫర్.. అందరు చూస్తుండగానే ఒక్కసారిగా కాలు జారిపడిపోయారు. వధువు వేదికపై వస్తున్న క్రమంలో సదరు ఫొటో గ్రాఫర్ పర్ఫెక్ట్ పొజిషన్ లోకి వచ్చేందుకు యత్నించాడు. అందుకోసం పరిగెత్తుకుంటూ వచ్చి వేదికపైకి జంప్ చేశాడు. అయితే వేదిక మరీ సాఫ్ట్ గా ఉండటంతో ఒక్కసారిగా కాలు జారి కిందపడిపోయాడు. ఈ క్రమంలో అతడి చేతిలో ఉన్న కెమెరా సైతం కిందపడిపోయింది.
ఆ ఫొటోగ్రాఫర్ ఎవరంటే?
కిందపడిపోయిన ఫొటోగ్రాఫర్ ను విజువల్ ఆర్టిస్ట్రీ సంస్థ వ్యవస్థాపకుడు శివమ్ కపాడియాగా గుర్తించారు. అయితే ఈ వీడియోను అతడే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. పోస్ట్ చేసిన కొద్దిసేపటికే అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ వీడియోకు సదరు ఫొటో గ్రాఫర్ పెట్టిన క్యాప్షన్ కూడా నవ్వులు పూయిస్తోంది. ‘ఆమె ఎంట్రీ స్మూత్‌గా జరిగింది.. నాది మాత్రం కాదు’ అంటూ శివమ్ కపాడియా ఫన్నీ క్యాప్షన్ ఇచ్చారు.
కిందపడినా.. వెంటనే లేచి
ఫొటో షూట్ సందర్భంగా ఒక్కసారిగా కిందపడిపోయినప్పటికీ శివమ్ కపాడియా తన పనిని ఎక్కడా ఆపలేదు. వెంటనే దాని నుంచి తేరుకొని పెళ్లి వేడుకను చిత్రీకరించాడు. వధువు వేదికపైకి వచ్చి ఎంతో అందంగా వరుడి వద్దకు వెళ్తున్న దృశ్యాలను అద్భుతంగా తన కెమెరాలో బంధించాడు. అయితే ఫొటోగ్రాఫర్ కిందపడటాన్ని దూరం నుంచి చూసిన వరుడు ఒక్కసారిగా షాక్ కు గురవడం వీడియోలో కనిపించింది. అయితే ఇదంతా చూసిన అతిథులు ఒక్కసారిగా నవ్వుకున్నట్లు తెలుస్తోంది.
నెటిజన్ల రియాక్షన్..
ఫొటోగ్రాఫర్ కిందపడిపోయిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఓ యూజర్ స్పందిస్తూ ‘కిందపడినప్పటికీ తన గురించి కాకుండా డీఎస్ఎల్ఆర్ గురించి టెన్షన్ పడ్డారు. మీ అంకిత భావానికి హ్యాట్సాఫ్’ అని రాశారు. ‘గాయపడినా లేచి షూటింగ్ మొదలుపెట్టాడు. ఇదే నిజమైన కెమెరామన్ డెడికేషన్. అందరూ అతడ్ని గౌరవించాల్సిందే’ అని మరో యూజర్ అన్నారు. ‘మన అద్భుత క్షణాలను అందంగా చిత్రీకరించేందుకు ఫొటోగ్రఫీ టీమ్ పడే కష్టాన్ని మనం తప్పక మెచ్చుకోవాల్సిందే’ అని ఇంకొకరు పేర్కొన్నారు.

