Government Hospitals: సర్కారు దవాఖానాల్లో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు గోల్డెన్ అవర్’లో అత్యుత్తమ చికిత్స అందించడమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రిటికల్ కేర్ బ్లాక్స్ మరో 15 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. తొమ్మిది జిల్లాల్లో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ బ్లాకులు, అత్యవసర వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే కార్పొరేట్ స్థాయి చికిత్సను అందించనున్నాయి. తొలి విడుతగా రాష్ట్రంలోని 9 ప్రధాన కేంద్రాల్లో ఈ 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాకులు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. వనపర్తి, కామారెడ్డి, జగిత్యాల, జనగామ, వికారాబాద్, గోదావరిఖని, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ఆదిలాబాద్ కేంద్రాల్లో వీటిని ప్రారంభించనున్నారు. ఈ కేంద్రాలు అందుబాటులోకి వస్తే ఎమర్జెన్సీ పేషెంట్లకు స్పీడ్‌గా వైద్యం అందుబాటులోకి రావడంతో పాటు ప్రమాదం జరిగిన తొలి గంటలోనే పేషెంట్లకు అత్యాధునిక వైద్యం అందనున్నది.
ఒకే చోట అన్ని సదుపాయాలు
ప్రతి క్రిటికల్ కేర్ బ్లాక్‌ను 50 పడకల సామర్థ్యంతో, సమగ్ర వైద్య సదుపాయాలతో తీర్చిదిద్దారు. దీని నిర్మాణం ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు వేగంగా స్పందించేలా రూపొందించారు. అత్యంత విషమంగా ఉన్న రోగుల కోసం 10 ఐసీయూ బెడ్లు, హై డిపెండెన్సీ యూనిట్‌లో 6 బెడ్లు, ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా 24 ఐసోలేషన్ బెడ్లు, తక్షణ ప్రాథమిక చికిత్స కోసం 4 ఎమర్జెన్సీ బెడ్లు, ప్రత్యేక కేటగిరీ రోగుల కోసం 2 ఐసోలేషన్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇక, వైద్య సేవలలో జాప్యం జరుగకుండా ఉండేందుకు 2 మాడ్యూలర్ ఆపరేషన్ థియేటర్లు (ఓటీ), ప్రసవాల కోసం 2 ఎల్‌డీఆర్ రూమ్స్, అత్యవసర కిడ్నీ బాధితుల కోసం 2 డయాలసిస్ బెడ్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు సొంతంగా ఆక్సిజన్ సప్లై ప్లాంట్, స్పెషల్ ల్యాబ్, సర్జికల్ ఐటమ్స్, మెడికల్ స్టోరేజ్ వంటి సదుపాయాలను అందుబాటులో ఉంచనున్నారు.
Also Read: Jogulamba Gadwal district: ప్రభుత్వ ఆసుపత్రిలో అరకొరగా వైద్యులు.. అందుబాటులో ఉండని మందులు..
’గోల్డెన్ అవర్’ వైద్యమే లక్ష్యం!
ప్రమాదాలు జరిగినప్పుడు, గుండెపోటు వంటి అత్యవసర సమయాల్లో మొదటి గంట ఎంతో కీలకం. ప్రస్తుతం జిల్లాల్లో సరైన సౌకర్యాలు లేక రోగులను హైదరాబాద్, ఇతర నగరాలకు తరలించే లోపు ప్రాణనష్టం జరుగుతున్నది. దీంతో క్రిటికల్ కేర్ యూనిట్లను పెట్టాలని సర్కార్ భావించింది. వీటి ద్వారా మెటర్నల్ (తల్లీ బిడ్డల) మరణాలను తగ్గించడంతో పాటు, క్రిటికల్ ఎమర్జెన్సీ మెడిసిన్ సేవలను గ్రామీణ ప్రజలకూ చేరువయ్యే అవకాశం ఉన్నది. తద్వారా పట్టణ ప్రాంతాల్లోని దవాఖానాలపై ఒత్తిడి కూడా తగ్గనున్నది. కేవలం 15 రోజుల్లో ఇవి ప్రారంభమైతే, పేద ప్రజలకు ఖరీదైన అత్యవసర వైద్యం ఉచితంగా, వేగంగా అందనున్నది. ఇది రాష్ట్ర ఆరోగ్య ముఖ చిత్రాన్ని మార్చే దిశగా వేసిన మరో బలమైన అడుగుగా అధికారులు చెబుతున్నారు.

