Jogulamba Gadwal district: జోగులాంబ గద్వాల జిల్లాలో (Government Hospitals) ప్రభుత్వ ఆసుపత్రులపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వంతో వైద్యుల పనితీరు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా ఉంది. ఈ ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేక వైద్యమందక రోగులు అవస్థలు పడుతున్నారు. అన్ని టెస్టులు అందుబాటులో ఉండవు. సదుపాయాలూ అరకొరగానే ఉన్నాయి. దాంతో ఎంతో ఆశతో ప్రభుత్వ వైద్యం కోసం వస్తే జనం టెస్టుల కోసం, మందుల కోసం ప్రైవేట్‌కు వెళ్లాల్సి వస్తోంది. జోగుళాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District) కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పేరుకే పెద్దా ఆసుపత్రి కాని ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని పలువురు వాపోతున్నారు.
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..
ప్రభుత్వ ఆసుపత్రిలో అందని వైద్యం
ఈ ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేక వైద్యమందక రోగులు అవస్థలు పడుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో పనిచేసే వైద్యుల్లో మెజారిటీ వైద్యులు ప్రైవేట్‌గా వైద్యం చేస్తుంటారు. కొంతమందికి సొంత ఆస్పత్రులు ఉండగా.. మరికొంత మంది ఇతర ఆస్పత్రుల్లో పనిచేస్తూ ప్రభుత్వ వైద్యాన్ని విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైద్యులకు సీనియారిటీ పెరిగిన కొద్దీ విధులకు డుమ్మా కొట్టడం ఎక్కువవుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రైవేట్‌లో పని లేకుంటేనే ప్రభుత్వాస్పత్రికి వస్తుంటారని సిబ్బందే అంటున్నారు.
డాక్టర్లు ఉండరు మందులు దొరకవు
గద్వాల (Gadwal) మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక ప్రమాదవశాత్తు కాళ్లు సైకిల్ టైర్ లో పడటంతో వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. ఓపీ రాయించుకుని పిల్లల వైద్య నిపుణులు సూచన మేరకు ఎక్స్ రే స్కానింగ్ కోసం రాసారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఎక్స్ రే చూయించుకుని ఆర్థోపెడిక్ ఫిజీషియన్ వైద్యుల గదికి వెళ్లారు. అక్కడి వైద్యులకు ల్యాబ్ నుంచి సమయానికి అందలేదు. ఎక్స్ రే రిపోర్టులు ఆలస్యం కావడంతో అప్పటికే సమయం అయిపోయిందని డాక్టర్లు వెళ్లిపోయారు.
అప్పుడు సమయం ఒంటిగంట అవడంతో వైద్యులు గంట ముందే వెళ్లిపోయారంటూ రోగుల తల్లిదండ్రులు ఆరోపించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ ఎంఎల్ టి స్టూడెంట్ కు ప్రమాదవశాత్తు ఆక్సీజన్ సిలిండర్ కాలు మీద పడటంతో ఎక్స్ రే రిపోర్టు తీసి రిపోర్టులు వచ్చే లోపల వైద్యులు లేకపోవడంతో చేసేదేమి లేక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. ఇలా ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని విభాగాల సీనియర్ వైద్యులు ఓపీల్లో కూర్చోకుండానే కాలం వెల్లదీస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటుండగా క్రిటికల్ కండిషన్ తో వచ్చే క్షతగాత్రుల పరిస్థితి ఏంటి అని ప్రజలు చర్చించుకుంటున్నారు. సంబంధిత వైద్యాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి పేదలకు సకాలంలో వైద్యం అందేలా కృషి చేయాలని కోరుతున్నారు.
Also Read: Jogulamba Gadwal district: ఇంటి పన్ను కట్టించుకుంటున్నారు.. కాని మంచి నీళ్ల గురించి పట్టించుకోరా?