RV Karnan: పెరిగిన జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజన ముసాయిదాపై అభ్యంతరాలు, సలహాలను స్వీకరించేందుకు సాయంత్రంతో గడువు ముగియనున్నట్లు జీహెచ్ఎంసీ (GHMC) కమిషనర్ ఆర్.వి. కర్ణన్ వెల్లడించారు. పునర్విభజనపై పాలక మండలి సభ్యుల అభ్యంతరాలను స్వీకరించేందుకు మంగళవారం నిర్వహించిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. మంగళవారం నాటికి పునర్విభజనపై మొత్తం 3,102 అభ్యంతరాలు స్వీకరించామని, మంగళవారం ఒక్కరోజే మరో 1,475 అభ్యంతరాలు రావడంతో మొత్తం సంఖ్య 4,616కు పెరిగిందని తెలిపారు. బుధవారం సాయంత్రం వరకు కూడా స్వీకరణకు గడువు ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
Also Read: RV Karnan: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం: ఎన్నికల అధికారి కర్ణన్
ప్రక్రియపై వివరణ
27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో జీహెచ్ఎంసీ విస్తీర్ణం 650 కి.మీ.ల నుంచి 2,050 కి.మీ.లకు, జనాభా కోటి 10 లక్షల నుంచి కోటి 34 లక్షలకు పెరిగిందని కమిషనర్ వివరించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో కలిసి జనాభా ప్రాతిపదికన డ్రాఫ్ట్‌ను రూపొందించామన్నారు. ప్రతి వార్డుకు నాలా, మెయిన్ రోడ్డు, రైల్వే ట్రాక్ వంటి వాటిని బౌండరీగా తీసుకుని ఈ డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టినట్లు వెల్లడించారు. వార్డులకు కొత్త పేర్లు పెట్టడం, సరిహద్దులకు సంబంధించి సుమారు 30 శాతం అభ్యంతరాలు వచ్చాయని, కొత్త వార్డులను ఏర్పాటు చేయాలని దాదాపు 15 శాతం సలహాలు వచ్చాయని కమిషనర్ తెలిపారు. అభ్యంతరాలను పరిశీలించి, పరిష్కరించేందుకు జోన్ల వారీగా ఐదుగురు అధికారులతో కమిటీలు వేశామని, వీటన్నింటిని పరిశీలించిన తర్వాతే పునర్విభజనకు సంబంధించి తుది ప్రకటన జారీ చేయనున్నట్లు కర్ణన్ స్పష్టం చేశారు.

