India Mexico Trade: మెక్సికో ప్రభుత్వం దిగుమతులపై భారీగా టారిఫ్‌లు పెంచే యోచన చేయడంతో, దాని ప్రభావం భారత ఎగుమతులపై పడకుండా ఉండేందుకు భారత్ ముందస్తు చర్యలకు దిగింది. మెక్సికోతో పరిమిత వాణిజ్య ఒప్పందం (Preferential Trade Agreement – PTA) కుదుర్చుకునే దిశగా చర్చలు ప్రారంభించామని వాణిజ్య మంత్రిత్వ శాఖ డిసెంబర్ 15న వెల్లడించింది.
వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ, పూర్తి స్థాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి చాలా సమయం పడుతుందని, అందుకే త్వరగా అమలయ్యే ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ మార్గాన్ని ఎంచుకున్నామని తెలిపారు. “ త్వరగా పరిష్కారం దొరకాలంటే PTA సరైన మార్గం. అందుకే మెక్సికోతో చర్చలు మొదలుపెట్టాం” అని ఆయన చెప్పారు.
మెక్సికో టారిఫ్ నిర్ణయం
డిసెంబర్ 11న మెక్సికో సెనేట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, చైనా సహా ఇతర ఆసియా దేశాల నుంచి దిగుమతి అవుతున్న 1,400కిపైగా ఉత్పత్తులపై టారిఫ్‌లను 50 శాతం వరకు పెంచేందుకు ఆమోదం తెలిపింది. దేశీయ తయారీదారులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెక్సికో ప్రభుత్వం పేర్కొంది. ఈ కొత్త టారిఫ్‌లు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
2 బిలియన్ డాలర్ల ఎగుమతులు ప్రమాదంలో
ఈ టారిఫ్ పెంపు వల్ల మెక్సికోకు భారత్ నుంచి వెళ్లే దాదాపు 2 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆటోమొబైల్స్, టూ వీలర్లు, ఆటో పార్ట్స్, టెక్స్టైల్స్ వంటి రంగాలు ఎక్కువగా దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: GHMC: మేయర్, కమిషనర్‌ను కలిసిన ప్రజాప్రతినిధులు.. అభ్యంతరాలు, సలహాలను సమర్పించిన బీఆర్ఎస్!
ఎగుమతిదారులకు రక్షణగా PTA
ఈ నేపథ్యంలో, మెక్సికోతో పరిమిత వాణిజ్య ఒప్పందం కుదిరితే, కొన్ని కీలక ఉత్పత్తులపై తక్కువ సుంకాలు లేదా ప్రత్యేక రాయితీలు లభించే అవకాశం ఉందని భారత్ భావిస్తోంది. దీని వల్ల భారత ఎగుమతిదారులకు కొంతమేర ఊరట లభిస్తుందని, టారిఫ్‌ల దెబ్బను తగ్గించవచ్చని అధికారులు అంటున్నారు.
Also Read: MS Subbulakshmi: ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ తెరకెక్కించనున్న గీతా ఆర్ట్స్!.. దర్శకుడు ఎవరంటే?
మెక్సికో మార్కెట్ భారత్‌కు ముఖ్యమైనదిగా మారుతున్న సమయంలో, టారిఫ్‌ల పెంపు పెద్ద అడ్డంకిగా మారకుండా ఉండేందుకు ముందుగానే చర్చలు మొదలుపెట్టడం వ్యూహాత్మక నిర్ణయంగా ప్రభుత్వం చూస్తోంది. ఈ చర్చలు ఎలా ముందుకు సాగుతాయన్నదానిపై, రానున్న రోజుల్లో భారత ఎగుమతుల భవితవ్యం ఆధారపడి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

