Bondi Beach Shooting: సిడ్నీలోని బాండి బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడికి కారణమైన తండ్రి–కొడుకు గత నెలలో భారత పాస్‌పోర్టులతో ఫిలిప్పీన్స్‌కు వెళ్లినట్టు తాజాగా వెల్లడైంది. ఫిలిప్పీన్స్ ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్పిన ప్రకారం, సాజిద్ అక్రం, అతని కుమారుడు నవీద్ అక్రం నవంబర్ 1న సిడ్నీ నుంచి ఫిలిప్పీన్స్‌కు వెళ్లారు. నవంబర్ 28న తిరిగి ఆస్ట్రేలియాకు వచ్చారు. వీళ్లు డావావో వెళ్లామని చెప్పి, అక్కడి నుంచి మానిలా మీదుగా సిడ్నీకి తిరిగివచ్చారు. బాండి బీచ్ కాల్పులకు ముందు నెలలోనే వీళ్లు ఫిలిప్పీన్స్‌కు వెళ్లి సైనిక శిక్షణ తీసుకున్నారా అనే అనుమానాలు ఉన్నాయి. నిందితుడి పేరిట ఉన్న కారులో ఇంట్లో తయారు చేసిన జెండాలు, కొన్ని పేలుడు పదార్థాలు దొరికాయి. దీన్ని బట్టి ఈ దాడి వెనుక ఐఎస్ సిద్ధాంత ప్రభావం ఉండొచ్చని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ చెప్పారు.
Also Read: GHMC: మేయర్, కమిషనర్‌ను కలిసిన ప్రజాప్రతినిధులు.. అభ్యంతరాలు, సలహాలను సమర్పించిన బీఆర్ఎస్!
కొనసాగుతోన్న పోలీసుల విచారణ
న్యూసౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, “వాళ్లు నిజంగానే ఫిలిప్పీన్స్‌కు వెళ్లారు. ఎందుకు వెళ్లారు, అక్కడ ఏం చేశారు అనే విషయాలపై దర్యాప్తు కొనసాగుతోంది” అని చెప్పారు. నిందితులు తమ కుటుంబానికి మాత్రం వీకెండ్ ఫిషింగ్ ట్రిప్ కు వెళ్తున్నామని చెప్పి, వాస్తవానికి క్యాంప్సీ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉండినట్టు తెలిసింది.
ఇంతకుముందే ఇంటెలిజెన్స్ నోటీసులో
ప్రధాని అల్బనీస్ ప్రకారం, నవీద్ అక్రం 2019లోనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీల దృష్టికి వచ్చాడు. అప్పట్లో విచారణ చేసినా అతనిపై ఎలాంటి పెద్ద అనుమానాలు లేవని తెలిపారు.
Also Read: GHMC: మేయర్, కమిషనర్‌ను కలిసిన ప్రజాప్రతినిధులు.. అభ్యంతరాలు, సలహాలను సమర్పించిన బీఆర్ఎస్!
తండ్రి వివరాలు
సాజిద్ అక్రం 1998లో స్టూడెంట్ వీసాతో ఆస్ట్రేలియాకు వచ్చాడు. తర్వాత రెసిడెంట్ వీసా కూడా పొందాడు. అతనికి చట్టబద్ధంగా తుపాకులు ఉంచుకునే లైసెన్స్ ఉంది. ఆరు తుపాకులు ఉండగా, వాటిలో కొన్ని బాండి బీచ్‌కు తీసుకువచ్చినట్టు పోలీసులు చెప్పారు. అతను ఒక గన్ క్లబ్ సభ్యుడు కూడా.
ఘోర ఘటన
హనుక్కా వేడుకలో పాల్గొన్న యూదులపై జరిగిన ఈ కాల్పుల్లో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక 10 ఏళ్ల చిన్నారి, బ్రిటన్‌కు చెందిన రబ్బీ, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, హోలోకాస్ట్ బాధితుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం బాండి బీచ్ పరిసర ప్రాంతం పోలీసుల అదుపులో ఉంది. బుధవారం మధ్యాహ్నానికి అక్కడి పరిస్థితి సాధారణ స్థితికి రావచ్చని అధికారులు చెబుతున్నారు.

