Brown University: అమెరికాలోని ఐవీ లీగ్ విద్యాసంస్థ బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. శనివారం యూనివర్సిటీ ఇంజినీరింగ్ భవనంలో జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారని ప్రావిడెన్స్ మేయర్ బ్రెట్ స్మైలీ తెలిపారు. ఘటన అనంతరం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. శనివారం రాత్రి తనకు ఈ కాల్పుల ఘటనపై వివరాలు అందాయని పేర్కొన్న ఆయన, “బాధితులు, వారి కుటుంబాలకు దేవుడు ధైర్యం ఇవ్వాలి” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరో పోస్టులో, “బ్రౌన్ యూనివర్సిటీ పోలీసులు ఇచ్చిన పూర్వ ప్రకటనను సవరించారు. నిందితుడి ఆచూకీ ఇంకా తెలియదు ” అని ట్రంప్ వెల్లడించారు.
Also Read: MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!
ఫైనల్ పరీక్షల రెండో రోజు జరుగుతున్న సమయంలో ఈ కాల్పులు జరగడం తీవ్ర భయాందోళనకు దారి తీసింది. వెంటనే యూనివర్సిటీలో ‘యాక్టివ్ షూటర్ అలర్ట్’ జారీ చేయడంతో పాటు క్యాంపస్, పరిసర ప్రాంతాల్లో ‘షెల్టర్ ఇన్ ప్లేస్’ ఆదేశాలు అమలు చేశారు. ఘటన జరిగిన రెండు గంటల తర్వాత కూడా పోలీసులు యూనివర్సిటీ భవనాలను ఒక్కొక్కటిగా తనిఖీ చేస్తూనే ఉన్నారు. స్థానికులు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు.
ప్రావిడెన్స్ డిప్యూటీ పోలీస్ చీఫ్ టిమోతి ఓ’హారా తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు నల్ల దుస్తులు ధరించిన పురుషుడిగా గుర్తించారు. అతడు కాల్పుల అనంతరం భవనం నుంచి బయటకు వెళ్లినట్లు సమాచారం. అతడు ఎలా భవనంలోకి ప్రవేశించాడన్న అంశంపై స్పష్టత లేదని, అయితే హోప్ స్ట్రీట్ వైపు నుంచి బయటకు వెళ్లినట్లు నిర్ధారించినట్టు చెప్పారు.
కాల్పుల ఘటన బారస్ & హోలీ భవనం సమీపంలో చోటు చేసుకుంది. ఇది బ్రౌన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్, ఫిజిక్స్ విభాగాలకు కేంద్రంగా ఉన్న ఏడు అంతస్తుల భవనం. యూనివర్సిటీ వెబ్‌సైట్ ప్రకారం, ఈ భవనంలో 100కు పైగా ల్యాబ్‌లు, అనేక తరగతి గదులు, కార్యాలయాలు ఉన్నాయి. ఘటన సమయంలో ఇక్కడ ఇంజినీరింగ్ డిజైన్ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి.
పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు సమీప నివాసితులు ఇళ్లకు తిరిగి రావొద్దని మేయర్ బ్రెట్ స్మైలీ విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీ యాజమాన్యం కూడా విద్యార్థులు, సిబ్బంది సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించింది. ఈ ఘటనలో మృతి చెందినవారి, గాయపడినవారి వివరాలు ఇంకా వెల్లడించలేదు. అలాగే కాల్పుల వెనుక కారణాలు, నిందితుడి ఉద్దేశ్యం ఏంటన్న విషయాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

