Rachakonda CP: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్, ఫుట్ బాట్ దిగ్గజం లియోనల్ మెస్సీ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. రేపు సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఫ్రెండ్లీ మ్యాచ్ లో వీరిద్దరు తలపడనున్నారు. ఇప్పటికే ఫుట్ బాల్ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోవడం, సీఎం రేవంత్ పాటు మెస్సీ మైదానంలో ఉప్పల్ స్టేడియంలో అడుగుపెడుతుండటంతో రాచకొండ పోలీసులు అప్రమత్తయ్యారు. ఫుట్ బాల్ మ్యాచ్ కి భారీ భద్రత కల్పించినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు.
3000 పోలీసులతో భద్రత
సీఎం – మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ కోసం 3000 మంది పోలీసులతో భారీ భద్రత కల్పించనున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు. అలాగే 450 సీసీ కెమెరాలు, మినీ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మెస్సీ భద్రత కోసం జెడ్ కేటగిరి భద్రతను కేటాయించినట్లు సీపీ తెలిపారు. మెస్సీ వచ్చే మార్గాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పాస్‌లు ఉన్నవారికే అనుమతి
మ్యాచ్ కు సంబంధించిన పాస్ లు ఉన్నవారినే లోనికి అనుమతిస్తామని సీపీ స్పష్టం చేశారు. స్టేడియం వద్ద ఎలాంటి పాస్ ల అమ్మకాలు జరగవని.. ఆన్ లైన్ లోనే వాటిని కొనుగోలు చేసుకోవాలని సూచించారు. పాస్ లు లేని వారు స్టేడియం వద్దకు రావద్దని చెప్పారు. మ్యాచ్ కు వచ్చేవారు పబ్లిక్ ట్రాన్స్ పోర్టును ఉపయోగించుకోవాలని సీపీ సూచించారు. ఆర్టీసీ బస్సులు, మెట్రోలో మ్యాచ్ కు రావడం ద్వారా ట్రాఫిక్ సమస్య నుంచి తప్పించుకోవచ్చని చెప్పారు. మరోవైపు వాహనాల్లో వచ్చే వారి కోసం పార్కింగ్ స్థలాన్ని కేటాయించినట్లు చెప్పారు. అక్కడ మాత్రమే వారు వాహనాలను పార్కింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. మెుత్తం 34 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు.
Also Read: KTR on Congress: కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్.. పల్లెల నుంచే ఆరంభం.. కేటీఆర్ సంచలన పోస్ట్
మ్యాచ్ షెడ్యూల్..
మెస్సీ రేపు సాయంత్రం 4 గం.లకు హైదరాబాద్ చేరుకుంటారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఫలక్ నమా ప్యాలెస్ కు వెళ్తారు. అక్కడి నుండి 7 గంటలకు ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. 7-8 గంటల మధ్య మైదానంలో మ్యాచ్ ఆడతారు. మ్యాచ్ చివరి 10 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇస్తారు. మెస్సీతో కలిసి ఫుట్ బాల్ ఆడతారు. అనంతరం విజేతలకు మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి బహుమతులు అందజేస్తారు. ఆపై మెస్సీ తిరిగి ఫలక్ నమా ప్యాలెస్ కు తిరిగి వెళ్లిపోతారు. రాత్రి ప్యాలెస్ లోనే బస చేసి.. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి ముంబయికి బయలుదేరుతారు.

