TG High Court: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ – 2 చిత్రం ఇవాళ (డిసెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా టికెట్ రేట్లను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై గురువారమే హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. అయితే నిన్న రాత్రి ప్రదర్శించిన ప్రీమియర్ షోలతో పాటు, ఇవాళ కూడా టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టు ఆశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంగా హైకోర్టు సింగిల్ డివిజన్ బెంచ్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఉత్తర్వులంటే లెక్కలేదా?
టికెట్ రేట్ల పెంపుపై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. అఖండ 2 నిర్మాతలతో పాటు ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సంస్థ బుక్ మై షోపై తీవ్రంగా మండిపడింది. తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు లంటే మీకు లెక్కలేదా అంటూ నిలదీసింది. టికెట్ రేట్లపై గురువారమే ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. ఎందుకు టికెట్లను అధిక ధరలకు విక్రయించారని బుక్ మై షోను నిలదీసింది. అయితే కోర్టు ఉత్తర్వులు తమ దృష్టికి వచ్చేలోపే అభిమానులు టికెట్లను కొనుగోలు చేశారని బుక్ మై షో తరపు లాయర్ వాదనలు వినిపించారు. అతడు ఇచ్చిన సమాధానంతో హైకోర్టు ఏమాత్రం సంతృప్తి చెందలేదు.
ప్రభుత్వంపై సీరియస్..
శుక్రవారం కూడా పెంచిన రేట్లతో టికెట్ విక్రయిస్తున్నారా? లేదా? అని బుక్ మై షో తరపు లాయర్ ను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. మీ మీద కోర్టు దిక్కారణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని కోరింది. సినిమా ప్రయోజనాల కోసం ప్రజల నుంచి అదనపు ధరలను వసూలు చేయడం ముమ్మాటికి తప్పేనని స్పష్టం చేసింది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వంపైనా హైకోర్టు సీరియస్ అయ్యింది. కోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయడం లేదని హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులు పట్టావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీసారి ఈ మెమోలు ఇవ్వడం ఎందుకు? కోర్టు ఉత్తర్వులు తర్వాత విత్ డ్రా చేయడం ఎందుకు? అని మండిపడింది. అనంతరం హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరోవైపు టికెట్ల విక్రయాలకు సంబంధించి పూర్తి వివరాలను కోర్టుకు తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది.
అఖండ – 2కి ఊరట..
మరోవైపు ‘అఖండ – 2’ టికెట్ ధరల పెంపుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. 14వ తేదీ వరకూ ఈ స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. టికెట్ల పెంపుపై తదుపరి విచారణను డిసెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది. డివిజన్ బెంచ్ స్టే విధింపుతో అఖండ 2 టికెట్లను తిరిగి పెంచుకునేందుకు మార్గం సుగమమైంది. దీంతో దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: TG Global Summit: గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి పోటెత్తిన జనం.. టూరిజంపై సదస్సు.. విద్యార్థులు, ప్రజల సందడి!
టికెట్ ధరలు పెంచబోం: మంత్రి
అఖండ 2 టికెట్ ధరల పెంపుపై వివాదం నెలకొన్న వేళ.. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఏ సినిమాకు టికెట్ ధరలు పెంచేది లేదని తేల్చిచెప్పారు. ఇకపై దర్శక, నిర్మాతలు తమ వద్దకు రావొద్దని సూచించారు. తమది ఇందిరమ్మ ప్రభుత్వమన్న ఆయన.. పేదల పక్షానే తాము ఉంటామని అన్నారు. పేదవారు కుటుంబంతో సినిమాకు వెళ్లాలంటే టికెట్ ధరలు అందుబాటులో ఉండాలని అభిప్రాయపడ్డారు. హీరోలకు రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ ఎందుకు ఇవ్వాలంటూ మంత్రి సూటిగా ప్రశ్నించారు.

