Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా కొందరు తన వ్యక్తిత్వ హక్కులు ఉల్లంగించేలా వ్యవహరిస్తున్నారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫలితంగా పవన్ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని ఆయన తరపున సీనియర్ న్యాయవాది సాయి కోర్టుకు తెలియజేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన దిల్లీ హైకోర్టు (Delhi High Court).. వారం రోజుల్లోగా ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలను తెలియజేయాలని పవన్ తరపు న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది.
ధర్మాసనం కీలక ఉత్తర్వులు
అదే సమయంలో పవన్ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తీసుకోవాలని గూగుల్ (Google), మెటా (Meta), ఎక్స్ (Twitter)లను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణనను డిసెంబర్ 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి. రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆయన్ను దెబ్బతీసేందుకు కొందరు సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుంటున్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పవన్ కళ్యాణ్.. దిల్లీ హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.
ఇటీవల నాగార్జున కూడా..
ప్రముఖ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున సైతం ఈ ఏడాది సెప్టెంబర్ లో దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో కొందరు వ్యవహరిస్తున్న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ఫొటోలు, వీడియోలు ఏఐ ద్వారా మార్ఫింగ్ చేస్తూ ప్రతిష్టను దిగజారుస్తున్నారని వాపోయారు. అశ్లీలతతో సోషల్ మీడియా పోస్టులు పెడుతూ.. దాన్ని అడ్డుపెట్టుకొని వ్యాపారం సైతం చేస్తున్నారని కోర్టుకు తెలియజేశారు. సినీ రంగంలో ఉన్న తన ఇమేజ్ ను ఇలా తప్పుడు మార్గాల ద్వారా పాడు చేస్తున్నారని కోర్టుకు తెలియజేశారు. నాగ్ వాదానలతో ఏకీభవించిన కోర్టు.. ఆయన అనుమతి లేకుండా పేరు, ఫొటో, వీడియోలు ఉపయోగించకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: Thummala Nageswara Rao: ముసాయిదా విత్తన చట్టంలో మార్పులు అవసరం.. కేంద్రానికి మంత్రి తుమ్మల అభ్యంతరాల నివేదిక!
మెగాస్టార్, తారక్ సైతం..
హీరో నాగ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సైతం దిల్లీ హైకోర్టును ఆదేశించారు. తన పేరు, ఫొటోలు, గెటప్స్, వాయిస్‌ను వాణిజ్యపరంగా అనుమతి లేకుండా వాడితే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కోర్టు నుంచి వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) అనుమతి పొందారు. అటు జూ.ఎన్టీఆర్ సైతం ఇటీవల దిల్లీ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా నేతృత్వంలోని ధర్మాసనం తారక్ కేసును విచారించి.. ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు (ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్), ఈ-కామర్స్ సంస్థలను ఆదేశించింది. గతంలో ఇలాంటి అంశాలనే లేవనెత్తుతూ పలువురు సినీప్రముఖులు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వీరిలో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, కరణ్ జోహార్, అనిల్ కపూర్ తదితరులు ఉన్నారు.

