Bandi Sanjay vs Etela Rajender: కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య ఆధిపత్య పోరు మరింత ముదిరింది. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా వీరి కోల్డ్ వార్ పీక్ స్టేజీకి చేరుకున్నది. ఒకే గ్రామ పంచాయతీలో అటు బండి సంజయ్, ఇటు ఈటల రాజేందర్ సర్పంచ్ అభ్యర్థిగా వేర్వేరు నేతలను బలపరిచినట్లుగా తెలుస్తున్నది. ఇందులో బీజేపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించాడని బండి వర్గీయులు చెబుతూనే, ఈటల బలపరిచిన అభ్యర్థి ఓటమి చవిచూశాడని ప్రచారం చేస్తుండడం పుండుపై కారం చల్లినట్లయింది. ఒకే పార్టీలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలు సర్పంచ్ ఎన్నికల్లో ఒకే జీపీకి వేర్వేరుగా అభ్యర్థులను బలపరచడం ఇరువురి మధ్య అంతర్యుద్ధం ఏ స్థాయిలో ఉందనేది సాక్షాత్కరిస్తున్నది. ఈ విషయం బండి వర్గీయులే అధికారికంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో ఆ నోటా ఈ నోటా పడి పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దీన్నిబట్టి చూస్తే తెలంగాణ బీజేపీలో, మరీ ముఖ్యంగా కరీంనగర్‌లో ఈటల ఆటలు సాగవనే సంకేతాన్ని ఇస్తున్నట్టుగా ఉన్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతున్నది.
సోషల్ మీడియాలో ప్రచారం
బండి సంజయ్ వర్గీయులు ఈ ఫలితాలను తమ నాయకుడి బలం, ఈటల ప్రభావం తగ్గుతుందనడానికి నిదర్శనంగా పేర్కొంటూ వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం ముమ్మరం చేశారు. ఈ అంశం ఈటల వర్గీయులకు ఆగ్రహం తెప్పిస్తున్నది. హుజూరాబాద్ అనేది రాజేందర్ రాజకీయ ప్రస్థానంలో కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ స్థానిక ఎన్నికల్లో తన వర్గం అభ్యర్థి ఓడిపోవడం, ప్రత్యర్థి వర్గం అభ్యర్థి గెలవడం ఈటలకు వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన అంశంగా మారింది. బండి వర్గీయులు గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థి వివరాలను, ఎన్నికల ఫలితాలను కోట్ చేస్తూ, ఈటల వర్గాన్ని టార్గెట్ చేస్తూ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు షేర్ చేశారు. దీంతో ‘బండి సంజయ్ బలం ఏంటో తేలిపోయింది’. ‘ఈటల కోటకు బీటలు’ వంటి వ్యాఖ్యలతో కూడిన సందేశాలు పార్టీ శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ప్రచారంతో ఈటల వర్గీయులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు.
Also Read: Bandi Sanjay: ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి 50 లక్షల వైద్య పరికరాలు ప్రారంభం : కేంద్ర మంత్రి బండి సంజయ్
లోపాయికారీ ఒప్పందాలు?
తెలంగాణ బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ వర్గాల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఆరోపణలు, లోపాయికారీ ఒప్పందాల దిశగా మలుపు తిరిగింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల ప్రభావాన్ని తగ్గించేందుకు బండి సంజయ్ ప్రత్యర్థి పార్టీలతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో, ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల బలపరిచిన అభ్యర్థికి ప్రత్యర్థిగా ఉన్నవారికి బండి ఎన్నికలకు ఫండింగ్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. బండి సంజయ్ ప్రత్యర్థి పార్టీలకు నిధులు పంపి ఈటల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారని నియోజకవర్గంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. మరీ ముఖ్యంగా ఈటల ప్రచారం చేసిన ప్రాంతాల్లోని ప్రత్యర్థి పార్టీలకు సంజయ్ సపోర్ట్ లభించిందనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
చాప కింద నీరులా ఇతర పార్టీల నేతలు తనవారేనని చెబుతూ ఫండింగ్ చేశారనే విమర్శలు వస్తున్నాయి. దీని వెనుక మరో ఉద్దేశం కూడా ఉన్నట్లు బలంగా వినిపిస్తున్నది. వచ్చే ఎన్నికల నాటికి డీలిమిటేషన్‌లో భాగంగా సెగ్మెంట్లు మారినా తనకు ప్రత్యర్థులతో ఇబ్బందులు రావొద్దని భావించి ఆయా పార్టీలతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని పరస్పరం సహకరించుకునేలా ప్లాన్ చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా త్వరలో ఎన్నికలు జరగబోయే ఇతర మండలాల్లో ఈటలను రానివ్వొద్దని, అందుకు ప్రతిఫలంగా ప్రతి గ్రామానికి పెద్ద మొత్తంలో నగదు ముట్టజెప్పేందుకు అంగీకారం కుదిరిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి బండి సంజయ్‌కు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి, పాడి కౌశిక్ రెడ్డి వర్గానికి చెందిన మరో వ్యక్తి ఈ వ్యవహారాన్ని మానిటరింగ్ చేస్తునట్లుగా చెప్పుకుంటున్నారు. తద్వారా చుట్టూ ఉన్న పల్లెల్లో ఈటల పట్టు సడలించాలని ప్లాన్ వేశారనే చర్చ జరుగుతున్నది.
పార్టీకే నష్టం
హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కమలాపూర్, భీమదేవరపల్లి మండలాల్లో తొలి దఫా పోలింగ్ జరిగింది. హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక మండలాలకు మూడో ఫేజ్‌లో పోలింగ్ జరగనున్నది. కమలాపూర్ మండలం ఉప్పలపల్లిలో బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి ర్యాకం శ్రీనివాస్ 90 ఓట్లతో విజయం సాధించారని బండి వర్గీయలు వాట్సాప్ గ్రూపుల్లో అధికారికంగా ప్రచారం చేపట్టారు. అలాగే, ఇక్కడ ఈటల రాజేందర్ బలపర్చిన అభ్యర్థి ర్యాకం సంపత్ ఓటమి చెందారని పేర్కొన్నారు. భీమదేవరపల్లి మండలం రసూల్ పల్లిలో బీజేపీ బలపర్చిన అభ్యర్థి మహేశ్ విజయం సాధించినట్లు వివరించారు. అయితే, ఉప్పలపల్లిలో ఈటల ప్రచారం చేయలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
కమలాపూర్ ఈటల రాజేందర్ సొంత మండలం. అక్కడ ఆయనకు బలం లేదని ప్రూవ్ చేయించాలని బండి సంజయ్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒకటని ఈటల వర్గీయులు చెబుతున్నారు. గతంలో బీజేపీకి అభ్యర్థులే లేరని, కొందరైనా వచ్చారంటే అది ఈటల వల్లేనని చెబుతున్నారు. వ్యక్తిగత ఇమేజ్ కోసం బండి పాకులాడుతున్నారని, ఈ పోకడలతో వ్యక్తిగతంగా ఆయన లాభపడినా డ్యామేజ్ అయ్యేది పార్టీ అనే విషయం గుర్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య సోషల్ మీడియాలో సాగుతున్న ఈ యుద్ధం, తెలంగాణ బీజేపీలోని రెండు బలమైన సామాజిక వర్గాల ఆధిపత్య పోరును కూడా ప్రతిబింబిస్తున్నదనే చర్చ జరుగుతున్నది. అయితే, గురువారం ప్రధాని మోదీ టీబీజేపీ ఎంపీలకు క్లాస్ తీసుకున్న కొద్ది గంటలకే ఈ ఆధిపత్య పోరు బహిర్గతమవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
హైకమాండ్ స్పందిస్తుందా?
బండి సంజయ్ గతంలో కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల్లో తనకు తక్కువ ఓట్లు రావాలని కొందరు పార్టీ నేతలు(పరోక్షంగా ఈటల వర్గం) పని చేశారని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్‌లో ఈటల పట్టును బలహీనపర్చాలనే వ్యూహంలో భాగంగానే ఈ ఫండింగ్ రాజకీయానికి తెర తీశారని చర్చించుకుంటున్నారు. గతంలోనూ పలు సందర్భాల్లో ఈ ఇద్దరు నేతల వ్యాఖ్యలు వివాదాలకు దారి తీశాయి. ‘తాను ఎవరికీ భయపడేది లేదని’ ఈటల కాస్త ఘాటుగా రియాక్ట్ అయిన సందర్భాలున్నాయి. స్థానిక ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు, బీఫారాల జారీపై చెలరేగిన వివాదాలు, ఇప్పుడు ఫలితాల తర్వాత మరింత ముదరడం నేతల మధ్య ఐక్యతకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నదని అనుకుంటున్నారు. రాష్ట్రంలో బలపడాలని చూస్తున్న బీజేపీకి ఈ అంతర్గత కలహాలు పెద్ద తలనొప్పిగా మారాయి. హైకమాండ్ తక్షణమే జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించకపోతే, ఇది పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Bandi Sanjay Kumar: ఆర్ఎస్ఎస్ కవాతులో కేంద్ర మంత్రి బండి సంజయ్

