Thummala Nageswara Rao: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తన ముసాయిదా చట్టం-2025పై అభ్యంతరాలకు కేంద్రం విధించిన గడువు గురువారంతో పూర్తయింది. కాగా అందులో మార్పులు, చేర్పులు చేపట్టాల్సిన అవసరముందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) తెలిపారు. సచివాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ మార్పులు, చేర్పులకు సంబంధించిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు విత్తనోత్పత్తి కీలకమని, వేలాది మంది రైతులు అధిక నాణ్యత గల విత్తనాల సాగు, సంరక్షణలో భాగస్వాములుగా ఉన్నారన్నారు. పదేళ్లలో విత్తనోత్పత్తి సమస్యలతో పాటు, ముఖ్యంగా పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయలు పండించే రైతులు నకిలీ, నాసిరకం, అనుమతి లేని, అధిక ధర కలిగిన విత్తనాల వ్యాప్తి కారణంగా నష్టాలను చవిచూశారన్నారు.
Also Read: Thummala Nageswara Rao: నకిలీ విత్తనాలపై నియంత్రణ రాష్ట్రానికే ఇవ్వాలి : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
మార్పుల కోసం డిమాండ్
నాణ్యత లేని హైబ్రిడ్, బీటీ విత్తనాల లభ్యత, విత్తనాలు, ఇన్‌పుట్ ఖర్చులు బాగా పెరగడంతో సాగు ఖర్చు గణనీయంగా పెరిగి వ్యవసాయ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని మంత్రి వివరించారు. 1966, 2004, 2010, 2019 విత్తన చట్టాల్లో అనేక నిబంధనలు ఉన్నప్పటికీ రైతుల ప్రయోజనాలు, హక్కులను పరిరక్షించలేకపోయాయని తెలిపారు. ముసాయిదా విత్తన బిల్లు-2025లో మార్పులు చేయాలని రాష్ట్రం తరఫున ప్రతిపాదనలు చేసినట్టు మంత్రి తెలిపారు.
వ్యవసాయ విత్తనాన్ని రైతులకు అమ్మకానికి విడుదల
రాష్ట్రస్థాయి, జిల్లాల స్థాయిలో రైతులతో, రైతు సంఘాల ప్రతినిధులతో, డీలర్లతో, విత్తనోత్పత్తి దారులతో, విత్తన కంపెనీ ప్రతినిధులతో పూర్తిస్థాయి చర్చలు జరిపి, వారి అభిప్రాయాలతో ఒక నివేదికను తయారుచేశామని మంత్రి స్పష్టంచేశారు. సెక్షన్ 13 నిబంధనను సవరించాల్సిన అవసరముందని, ఏదైనా వ్యవసాయ విత్తనాన్ని రైతులకు అమ్మకానికి విడుదల చేసే ముందు, కేంద్ర విత్తన కమిటీతో ముందస్తు నమోదు తప్పనిసరి చేయాలని తుమ్మల సూచించారు. ఈ అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదనలు చేసి వీటన్నిటిని ముసాయిదా విత్తన బిల్లులో చేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు మంత్రి తెలిపారు.

