C5 Alliance: వేర్వేరు అంశాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు చాలా కూటములుగా ఏర్పడ్డాయి. నిర్దిష్ట అంశాల్లో లక్ష్యాలకు అనుగుణంగా కలిసి పనిచేస్తున్నయి. అయితే, వీటన్నింటినీ తలదన్నేలా, సరికొత్త ఫార్ములాతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టాప్-5 దేశాలను కలుపుకొని సరికొత్త కూటమిని ఏర్పాటు చేయాలని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. అటు అమెరికా మేధావి వర్గాలు, అంతర్జాతీయ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది.
సీ-5 అంటే ఏమిటి?
సీ-5 అంటే, కోర్-5 (ముఖ్యమైన ఐదు) అని, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టాప్-5 దేశాలతో ఈ కూటమిని ఏర్పాటు చేయాలని ట్రంప్ ప్రతిపాదిస్తున్నట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. ట్రంప్ మనసులో పురుడు పోసుకున్న ఈ ఆలోచన ప్రస్తుతం ప్రపంచ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, జీ7 లాంటి సంప్రదాయక కూటములకు ప్రత్యామ్నాయంగా నిలవచ్చనే ఉద్దేశంతో ట్రంప్ ఈ ఆలోచన చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
సీ-5లో ప్రతిపాదిత దేశాలివేనా?
సీ-5కి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. అయితే, డొనాల్డ్ ట్రంప్ సర్కారుకు సంబంధించిన జాతీయ భద్రతా వ్యూహానికి సంబంధించిన రహస్య సంస్కరణలో కీలక ప్రతిపాదనలు ఉన్నాయంటూ ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సీ-5 కూటమిలో అమెరికా, రష్యా, చైనా, భారత్, జపాన్ భాగస్వామ్య దేశాలుగా ఉండాలంటూ ట్రంప్ ప్రతిపాదనలు చేసినట్టుగా తెలుస్తోంది.
అత్యధిక జనాభా, ఆర్థిక, సైనిక శక్తి
ట్రంప్ ప్రతిపాదన ప్రకారం చూస్తే, ఈ ఐదు దేశాలు ప్రపంచంలో అత్యధిక జనాభాను కలిగి ఉన్నాయి. అంతేకాదు, ఆర్థిక సామర్థ్యం పరంగా కూడా అత్యంత శక్తివంతమైనవి. సైనిక పరంగా కూడా దేశాలను అత్యంత బలోపేతమైనవి. అందుకే, ఈ దేశాలను ఒకే వేదికపైకి తీసుకొస్తే తిరుగుండదని ట్రంప్ భావిస్తున్నట్టుగా కథనాలు పేర్కొంటున్నాయి.
ప్రధాన లక్ష్యాలు, ఆశిస్తున్న మార్పులేవి?
జీ7 కూటమికి సీ-5 ప్రత్యామ్నాయంగా నిలవాలని ట్రంప్ భావిస్తున్నారు. జీ7లో అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ సంపన్నమైనవే కాకుండా, ప్రజాస్వామ్య దేశాలు కూడా. అయితే, ట్రంప్ భావిస్తున్న కూటమిలో ఆర్థిక, సైనిక శక్తి, జనాభా ప్రాతిపదికన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతమున్న జీ7 వంటి పాత వ్యవస్థలు ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులకు సరిపోవని ట్రంప్ భావిస్తున్నారట.
భౌగోళిక రాజకీయ సమతుల్యత
సీ-5 కూటమి ద్వారా ప్రపంచంలో శక్తివంతమైన దేశాల మధ్య సమతుల్యతను సాధించాలనేది ట్రంప్ ఆలోచనగా ఉంది. అమెరికాకు సంప్రదాయ ప్రత్యర్థులుగా భావించే చైనా, రష్యా దేశాలను కూడా ఒకే వేదికపైకి తీసుకురావడం ఇందులో ఒక ముఖ్య అంశంగా ఉందని తెలుస్తోంది.
యూరప్‌కు చెక్!
సీ-5 ప్రతిపాదనలో యూరోపియన్ దేశాలు ఒక్కటి కూడా లేదు. దీనిని బట్టి యూరప్‌పై అమెరికా తన దృష్టిని మార్చుకుందని చెప్పడానికి ఇదే సంకేతమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతం వైపు అమెరికా చూస్తోందని చెప్పడానికి ఇది సంకేతంగా నిలిచింది. సీ-5 ఏర్పాటు చేయడం ద్వారా నాటో విస్తరణను నిలిపివేయడం, అమెరికా సైనిక మద్దతుపై ఐరోపా దేశాలు ఆధారపడటాన్ని తగ్గించడం వంటి అంశాలు కూడా ట్రంప్ సర్కారు రహస్య పత్రాలలో ఉన్నట్లు సమాచారం.
అయితే, ఈ కూటమికి ప్రతిపాదనలకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. అయితే, ట్రంప్ బృందంలోని పలువురు కీలక అధికారులు ఈ రహస్య పత్రాలపై వస్తున్న వార్తలను ఖండించారు.

