Delhi Blast: ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ప్రాంతంలో జరిగిన ఘోర కార్ బ్లాస్ట్‌లో 11 మంది ప్రాణాలు కోల్పోయిన కేసులో దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక పురోగతి సాధించింది. “వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్”గా గుర్తించిన ఈ కేసులో ఎనిమిదో నిందితుడిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. అరెస్టైన వ్యక్తి డాక్టర్ బిలాల్ నసీర్ మల్లాగా గుర్తించారు.
ఎన్‌ఐఏ ప్రకారం, డాక్టర్ బిలాల్ ఉగ్రవాద కుట్రలో భాగమయ్యాడని, ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్-ఉన్-నబీకి ఆశ్రయం ఇచ్చి లాజిస్టికల్ సపోర్ట్ అందించాడని ఆరోపించింది. అలాగే, బ్లాస్ట్‌కు సంబంధించిన సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా నాశనం చేసినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. ఆయనను ఢిల్లీలోనే అరెస్టు చేసినట్లు వివరించారు.
Also Read: Telangana: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. రాబోయే రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం
ఘోర పేలుడుకు దారితీసిన ఈ మాడ్యూల్ కార్యకలాపాలను పూర్తిగా తుడిచిపెట్టేందుకు దర్యాప్తు కొనసాగుతోందని, కేంద్ర- రాష్ట్ర ఏజెన్సీలతో కలిసి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని ఎన్‌ఐఏ మరో ప్రకటనలో వెల్లడించింది. డాక్టర్ బిలాల్‌ను ఢిల్లీలోని ప్రత్యేక NIA కోర్టు న్యాయమూర్తి అంజూ బజాజ్ చంద్నా ముందుకు హాజరుపరచగా, ఏజెన్సీ అభ్యర్థనపై అతనిని ఏడు రోజులపాటు NIA కస్టడీకి అప్పగించారు. అదే కేసులో మరో నిందితుడు అమీర‍్ రషీద్ అలీ కస్టడీని కూడా కోర్టు మరో ఏడు రోజులు పొడిగించింది.
దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుండి ఎన్‌ఐఏ ఇప్పటివరకు ఏడు మందిని కస్టడీలోకి తీసుకుంది. వీరిలో ముగ్గురు వైద్యులు.. డాక్టర్ ముజ్జమ్మిల్ గనాయి, డాక్టర్ అదీల్ రాథర్, డాక్టర్ షహీనా సయీద్ తో పాటు మత ప్రచారకుడు మౌల్వీ ఇర్ఫాన్ ఉన్నారు. ఇంకా అమీర‍్ రషీద్ అలీ, జాసిర్ బిలాల్ వాణి అలియాస్ దానిష్ వంటి వ్యక్తులను కూడా అరెస్టు చేసింది. దర్యాప్తులో బయటపడిన కీలక విషయం ఏమిటంటే.. ఆత్మాహుతి బాంబర్ ఉమర్ నబీ పేలుడు పదార్థాలతో నింపిన కారు కొనుగోలు చేసినప్పుడు, అది అమీర‍్ దానిష్ అలీ పేరుతో నమోదు చేయబడింది. అదే కారు రెడ్ ఫోర్ట్ దగ్గర పేలిపోయింది.
ఈ “వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్”ను మొదటగా జమ్మూ – కాశ్మీర్ పోలీసులు, ఉత్తరప్రదేశ్ – హర్యానా పోలీసులతో కలిసి ఛేదించగా, దర్యాప్తును ముందుకు తీసుకెళ్లిన అధికారులు ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీలో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ మొత్తం 2,900 కిలోల ఎక్స్‌ప్లోసివ్ మెటీరియల్ బయటపడటం సంచలనం సృష్టించింది. ఎన్‌ఐఏ ఈ కేసు వెనుక ఉన్న మొత్తం కుట్రజాలాన్ని పూర్తిగా వెలికితీయడానికి ప్రయత్నాలు వేగవంతం చేసింది.
NIA Arrests Another Key Accused in Delhi Bomb Blast Case pic.twitter.com/VxrX8X05jo
— NIA India (@NIA_India) December 9, 2025

