Virat Kohli: భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ తన ప్రసిద్ధ స్పోర్ట్స్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ One8ను బెంగళూరు ఆధారిత స్టార్ట్‌ప్ Agilitasకు విక్రయించేందుకు అంగీకరించాడు. దీంతో పాటు, కోహ్లీ వ్యక్తిగతంగా ₹40 కోట్లు పెట్టుబడి పెట్టి కంపెనీలో మైనారిటీ స్టేక్‌ను కూడా పొందనున్నాడు. ఈ డీల్ పూర్తయితే, కోహ్లీ అధికారికంగా అజిలిటాస్ Agilitasలో భాగస్వామి అవుతారు అని కంపెనీ CEO అభిషేక్ గంగూలీ వెల్లడించారు.
అజిలిటాస్ (Agilitas) కోసం One8 రెండో ప్రధాన ఆక్విజిషన్‌గా మారనుంది. గతంలో ఈ స్టార్ట్‌ప్ Mochiko Shoesను కొనుగోలు చేసింది. Adidas, Puma, New Balance, Crocs, Skechers, Clarks వంటి ఎన్నో అంతర్జాతీయ బ్రాండ్లకు షూలు తయారు చేసే Mochiko, భారత ఫుట్‌వేర్ మార్కెట్‌లో కీలక స్థానం సంపాదించింది. ఇప్పుడు One8 కొనుగోలుతో, అజిలిటాస్( Agilitas) భారత స్పోర్ట్స్-ఫ్యాషన్ రంగంలో మరింత బలపడనుంది.
డీల్ ప్రకారం, కోహ్లీ One8ను పూర్తిగా అజిలిటాస్( Agilitas) కు విక్రయించడమే కాకుండా, రూ.40 కోట్ల పెట్టుబడి కంపెనీకి మద్దతు అందించనున్నారు. ఈ భాగస్వామ్యం ఎక్స్‌క్లూజివ్ అవుతుందని గంగూలీ తెలిపారు. అంటే, కోహ్లీ ఇకపై ఇతర స్పోర్ట్స్ బ్రాండ్లను ప్రమోట్ చేయడం ఉండదు. కోహ్లీకి లభించే వాటా మిడ్ సింగిల్ డిజిట్స్‌లో ఉండే అవకాశం ఉందని సమాచారం.
ఈ డీల్ కోహ్లీ– పుమా సంబంధాల్లో వచ్చిన తాజా మార్పులతో కూడా అనుసంధానమై ఉంది. కోహ్లీకి Pumaతో ఉన్న 8 ఏళ్ల, రూ.110 కోట్ల కాంట్రాక్ట్ ఈ ఏడాది ముగిసింది. దాన్ని రీ న్యూ చేసుకున్నట్లయితే ఒప్పందం విలువ రూ.300 కోట్లకు పెరిగేది. కానీ, కోహ్లీ ఈ లాభదాయక డీల్‌ను వదిలి, కొత్త స్టార్ట్‌ప్ Agilitasతో ముందుకు వెళ్లడాన్ని ఎంచుకున్నాడు. “ నేను One8తోనే ఉండోచ్చు… లేదా అజిలిటాస్( Agilitas) తో పెద్ద ప్రయాణం ప్రారంభించవచ్చు. నేను రెండో దానిని ఎంచుకున్నాను,” అని కోహ్లీ సోషల్ మీడియాలో వెల్లడించాడు.
Agilitas CEO గంగూలీ మాట్లాడుతూ, “ విరాట్ కోహ్లీ రూ.300 కోట్ల నష్టం పూడ్చుకోవాలని ప్రయత్నించడం లేదు. ఆయన బాగా ఆలోచించి దృష్టితో అజిలిటాస్ Agilitasను పెద్ద స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ఈ డీల్‌లోకి వచ్చాడు” అని అన్నారు. మొత్తం మీద, ఈ భాగస్వామ్యం భారత స్పోర్ట్స్-ఫ్యాషన్ మార్కెట్‌లో పెద్ద మార్పు తెచ్చే అవకాశం ఉన్న వ్యూహాత్మక ఒప్పందంగా భావిస్తున్నారు.

