indian Pilots: భారతదేశంలోని ఆరు ప్రధాన డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌లో మొత్తం 13,989 పైలట్లు పనిచేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. సోమవారం సివిల్ ఏవియేషన్ శాఖలో రాష్ట్ర మంత్రి మురళీధర్ మొహోల్ ఈ వివరాలను లిఖితపూర్వక సమాధానంగా ఇచ్చారు.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, ఎయిర్ ఇండియాలో 6,350 మంది పైలట్లు పనిచేస్తుండగా, దాని లో-కాస్ట్ విభాగమైన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 1,592 మంది పని చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్ అయిన ఇండిగోలో 5,085 మంది పైలట్లు పని చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా వచ్చిన అకాశా ఎయిర్‌లో పైలట్ల సంఖ్య 466 కాగా, స్పైస్‌జెట్‌లో 385 మంది పైలట్లు ఉన్నారని వెల్లడించారు. ప్రభుత్వరంగ సంస్థ అలయెన్స్ ఎయిర్‌లో 111 మంది పైలట్లు సేవలందిస్తున్నారు.
పైలట్ల నియామకాల విషయానికి వస్తే, అది పూర్తిగా మార్కెట్ డిమాండ్, ఎయిర్‌లైన్స్ అవసరాలు, స్పెషల్ టైప్-రేటెడ్ పైలట్ల లభ్యతపై ఆధారపడి ఉంటుందని మంత్రి తెలిపారు. విదేశీ పైలట్లను నియమించాల్సిన అవసరం కూడా ఫ్లీట్ విస్తరణ, టైమ్-బౌండ్ ఆపరేషనల్ అవసరాల కారణంగా వస్తుందని మొహోల్ వివరించారు.
అదే సమయంలో, దేశంలోని Flying Training Organisations (FTOs) తమ శిక్షణ వాహనాలను నిరంతరం అప్‌గ్రేడ్ చేస్తున్నాయని మంత్రి తెలిపారు. డిజిసిఎ ఇప్పటి వరకు 2025 నవంబర్ వరకు FTOల కోసం 61 ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అనుమతించింది. అలాగే 2025లో రెండు కొత్త FTOలకు కూడా ఆమోదం లభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40 FTOలు 62 బేస్‌లపై కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
ఫ్లయింగ్ ట్రైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆధునీకరణ పూర్తిగా మార్కెట్ ఆధారంగా జరుగుతుందని, ఇందులో సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖకు ప్రత్యక్ష పాత్ర ప్రస్తుతం లేదని తెలిపారు. అయితే, ICAO సభ్య దేశంగా భారతదేశం, తన శిక్షణ ప్రమాణాలు, నియంత్రణలను ICAO యొక్క SARPsతో అనుసంధానిస్తున్నట్లు చెప్పారు. FTOలపై డిజిసిఎ సమయానుకూలంగా సర్వేలెన్స్ చేపట్టి, సేఫ్టీ ప్రమాణాలు పాటించబడుతున్నాయో లేదో నిరంతరం పరిశీలిస్తోందని మొహోల్ వివరించారు. అవసరమైతే ప్రత్యేక భద్రతా ఆడిట్లు, స్పాట్ చెక్‌లు కూడా చేపడుతున్నట్లు తెలిపారు.

